ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప- హత్యలుండవు. ఈటెల రాజేందర్‌కు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారు.ఈటెల రాజేందర్ ఆత్మరక్షణ కోసం కాదు-ఆస్తులు రక్షణ కోసమే బీజేపీలోకి వెల్లుతున్నారని అన్నారు. ఈటెల రాజేందర్ బై ఎలక్షన్‌లో ఓడిపోవడం ఖాయం..ఆయన్ని ఆ దేవుడు కూడా గెలిపించలేడు. దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ పడిపోయింది. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపికి పరాభవం ఎదురయ్యింది.
టిఆర్‌ఎస్ పార్టీ బలంగా బలోపేతం అయిన పార్టీ. మరో 20 సంవత్సరాలు టిఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. 2026 ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయి. నియోజకవర్గల డి- లిమిటేషన్ 2026లో పూర్తి అవుతుంది. రానున్న ఎన్నికల్లో మాత్రం ఇప్పుడున్న రిజర్వేషన్లు వర్తించే విధంగా ఎన్నికలు జరుగుతాయని గుత్తా తెలిపారు.
వ్యవసాయ రంగం టిఆర్‌ఎస్ పాలనలో అద్భుతమైన అభివృద్ధి చెందింది.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూశారు.ధాన్యం పండించడంలో అతి త్వరలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.