భట్టి చెప్పున్నట్లు..బయట జరగట్లేదు!

3
- Advertisement -

ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే రైతులే సొంత డబ్బులతో మరమ్మత్తులకు తీసుకెళ్తున్నారన్న విషయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా ఒప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మండలిలో జరిగిన చర్చలో ఆయన స్పష్టంగా స్పందించారు. “దానికి సాక్ష్యం నేనే. మంత్రి భట్టి విక్రమార్క ఇక్కడ చెప్తున్న మాటలకు, బయట జరుగుతున్న పరిస్థితులకు చాలా తేడా ఉంది. వాస్తవంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు ప్రభుత్వం వాటిని మరమ్మత్తులకు తీసుకెళ్తుందని చెబుతున్న మాటలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. చాలా చోట్ల రైతులే డబ్బులు సమకూర్చుకుని ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మత్తులకు పంపిస్తున్నారని చెప్పారు. ఇది రైతులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్న పరిణామమని మండలిలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది.

ఈ విషయంపై సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కూడా ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో మూడు డీడీలు చెల్లిస్తే ఏడు విద్యుత్ స్తంభాలు ఇచ్చేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఒక డీడీకి ఒక్క స్తంభమే ఇస్తున్నారని విమర్శించారు. ఆ స్తంభాలకూ రైతులే మళ్లీ డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు వ్యవసాయ రంగంలో విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల పరిస్థితిపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రైతుల కష్టాలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది.

Also Read:మోడీ అంటే ఇష్టం అంటూనే..భారత్‌కు ట్రంప్ హెచ్చరిక!

 

- Advertisement -