`ఆర్.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ నాయికగా తెరకెక్కిన చిత్రం `గుణ 369`. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రమిది. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలి పాటను స్టార్ ప్రొడ్యూసర్ `దిల్`రాజు, రెండో పాటను ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం, అలీ విడుదల చేశారు. ఇటీవల ట్రైలర్‌ను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను ఆవిష్కరించారు.తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట సోమవారం హైదరాబాద్‌లో విడుదలైంది.
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. “గుణ 369 ట్రైలర్ చూశా. ఇవాళ నా చేతుల మీదుగా ఓ పాట విడుదలైంది. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరచగా, రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాట చాలా బావుంది. ట్యూన్ బావుంది. లిరిక్ బావుంది. దృశ్యాన్ని చిత్రీకరించిన తీరు బావుంది. ట్రైలర్‌లో హీరో పెర్ఫార్మెన్స్, యాక్షన్ బావుంది. ఈ సినిమాను నాకు ఎంతో సన్నిహితులైన అనిల్, ప్రవీణ, తిరుమల్‌రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. వీరు ముగ్గురూ ఎన్నో అద్భుతమైన షోలు మన దగ్గర, విదేశాల్లోనూ నిర్వహించారు. వారు తొలిసారి సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఆ షోలు ఎంత అద్భుతంగా విజయవంతమయ్యాయో, ఈ సినిమా కూడా అంతే గొప్పగా హిట్ కావాలని ఆశిస్తున్నాం. కొత్తగా వస్తున్న దర్శకుడు అర్జున్ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటాడని, భవిష్యత్తులో మంచి సినిమాలు చేస్తాడని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో పనిచేసిన మిగిలిన టెక్నీషియన్లు అందరికీ ఆల్ ది బెస్ట్ “ అని అన్నారు.
రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ “మంచి మీనింగ్‌ఫుల్, సిట్చువేషనల్ సాంగ్ నేను ఇందులో రాశాను. ఈ పాట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అమృతహస్తాల మీదుగా విడుదల కావడం, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రిలీజ్‌ని ఇలా ప్లాన్ చేసిన ప్రవీణకి, అనిల్‌కి, తిరుమలరెడ్డికి మనస్ఫూర్తిగా థాంక్స్. ఎప్పుడు నన్ను చూసినా రాఘవేంద్రరావు కళ్లల్లో ప్రేమ, ఆప్యాయత, ఆనందం, సంతృప్తి కనిపిస్తుంటాయి. అది… మనసులు మనసులు మాట్లాడుకునేలా నాకు బోధపడుతుంటుంది. ఎన్నో రికార్డులు సృష్టించిన చరిత్ర ఉన్న వ్యక్తి చేతుల మీదుగా నా పాట విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగులో మంచి హీరో దొరికాడు. బాడీ బిల్డప్ ఉన్నప్పటికీ, అతనిలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే.. ఒక ఇన్నొసెన్స్ ఉంటుంది ఆ ఫేస్‌లో. ట్రైలర్‌లో చూసిన లవ్ ట్రాక్‌లోనూ చాలా ఈజ్‌తో చేశాడు. అర్జున్‌కి లడ్డులాగా దొరికాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అనుకున్న పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం వారికి వెన్నతో పెట్టినవిద్య. వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అర్జున్ మరిన్ని సినిమాలతో ముందుకెళ్లాలి. అనిల్‌గారి టీమ్ మరిన్ని గొప్ప సినిమాలు తీయాలి“ అని అన్నారు.
నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ “కె.రాఘవేంద్రరావుగారు పాజిటివిటీ ఉన్న వ్యక్తి. మంచి ఎక్కడున్నా వెంటనే అభినందిస్తారు. మా సినిమా ట్రైలర్ చూసి బావుందని మెచ్చుకున్నారు. మా చిత్రంలో రామజోగయ్యశాస్త్రి రాసిన పాటను ఆయన చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. మంచి సినిమా చేశామని సంతృప్తి మాలో ఉంది. ట్రైలర్ చూసిన వారందరూ హిట్ గ్యారంటీ అని అంటున్నారు“ అని అన్నారు.
చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ “ఈ పాటకు సిట్చువేషన్ మెయిన్. దాన్ని అర్జున్‌గారు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. దానికి రామజోగయ్యశాస్త్రిగారు అర్థమయ్యేలా చక్కటి పదాలతో రాశారు. ఏ పాటయినా బాగా ఎలివేట్ అయింది అంటే దానికి కారణం మంచి లిరిక్స్, వాటిని పాడిన సింగర్స్… వారిద్దరి వల్లనే కంపోజర్ పడిన ఎఫర్ట్ బయటి ప్రపంచానికి తెలుస్తుంది. రెండు వందల శాతం ఈ పాట అందరికీ నచ్చుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నా. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చిన అర్జున్‌గారికి, నిర్మాతలు ప్రవీణగారికి, అనిల్‌గారికి, తిరుమల్‌గారికి ధన్యవాదాలు“ అని చెప్పారు.