బుధవారం (నేడు) మధ్యాహ్నం ఒంటి గంటకు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల ప్రధాన అధికారి అచల్ కుమార్ జోతి వెల్లడించారు.
182 అసెంబ్లీ స్థానాలకు రాష్ట్రంలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, డిసెంబర్ 9,14న ఎన్నికలు జరగుతాయని వెల్లడించారు. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇక …2018, జనవరి 22 నాటికి ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగియనుంది. గుజరాత్ రాష్ట్రంలో 4.33 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 50,128 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీపాట్ వినియోగం ఉంటుందన్నారు.
అలాగే ఎన్నికల కోడ్ ను నేటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ. 28 లక్షలకు మించి ఖర్చు చేయరాదని, అలాగే ఆయా అభ్యర్థులు కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచి, ఎన్నికల ఖర్చును చూపించాలని ఆయన తెలిపారు. ఎవరయినా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే తాము ప్రత్యేకంగా రూపొందించిన ఈసీ మొబైల్ యాప్ ద్వారా ఎన్నికల అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.