జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు బాగా పెరిగాయి- నిర్మలా సీతారామన్

156
Nirmala Sitharaman
- Advertisement -

వస్తు సేవా పన్ను (జీఎస్టీ)ని ప్రారంభించి నాలుగేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు బాగా పెరిగాయని, ఇకపై ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయన్నారు. ప‌న్నుల వ్య‌వ‌స్థ స్థిర‌త్వానికి చేసిన ఈ ప్ర‌య‌త్నంలో చాలా వ‌ర‌కూ స‌వాళ్ల‌ను అధిగ‌మించిన‌ట్లు ఆమె చెప్పారు. జీఎస్టీ అమ‌లు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ ట్యాక్స్ బేస్ రెట్టింపైనట్లు తెలిపారు. అంత‌కుముందు 66.25 ల‌క్ష‌లుగా ఉన్న ట్యాక్స్ బేస్ ఇప్పుడు 1.28 కోట్ల‌కు చేరిన‌ట్లు నిర్మ‌ల వెల్ల‌డించారు.

తాజాగా వ‌రుస‌గా ఎనిమిదో నెల కూడా జీఎస్టీ వ‌సూళ్లు రూ.ల‌క్ష కోట్లు దాట‌డం గ‌మ‌నార్హం. ఏప్రిల్‌లో అయితే అత్య‌ధికంగా రూ.1.41 ల‌క్ష‌ల కోట్ల జీఎస్టీ వ‌సూలైన‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. జీఎస్టీని అమ‌లు చేయ‌డంలో స‌హ‌క‌రించిన దేశ ప్ర‌జ‌ల‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ కొత్త ప‌న్ను విధానం వ‌ల్ల ఏకీకృత మార్కెట్‌, ప‌న్ను మీద ప‌న్ను విధానం తొల‌గింపు, వ‌స్తుసేవ‌ల్లో పెరిగిన పోటీత‌త్వం వ‌ల్ల ఆర్థిక వృద్ధి వేగం పెరిగింద‌ని ఆమె వెల్ల‌డించారు. జీఎస్టీ చెల్లింపుల్లో మోసాలను అధికారులు అరికట్టగలిగారని ఆమె కొనియాడారు.

సమయానికి జీఎస్టీ రిటర్నులను దాఖలు చేసి పన్ను కట్టిన 54,439 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అందులో 88 శాతం మంది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వారే కావడం విశేషం. జీఎస్టీ చెల్లింపుదారుల ఆందోళనలను జీఎస్టీ మండలి ఎప్పటికప్పుడు తెలివిగా పరిష్కరించిందని ప్రశంసించారు. జీఎస్టీ వచ్చాక పరిశ్రమలకు పన్ను కట్టడం చాలా సులువైందని, సామాన్యుడిపై పన్ను భారం కూడా తగ్గిందని నిర్మల చెప్పారు. ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను, వ్యాట్ వంటి 17 పన్నులు, 13 సుంకాలను కలిపి.. 2017 జులై 1న ఒకే పన్ను ‘జీఎస్టీ’గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

- Advertisement -