దేశంలో వాయు కాలుష్యం ఒక నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టిస్తున్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుర్తించబడని ఊపిరితిత్తుల, గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, దీర్ఘకాలిక శుభ్రమైన గాలి విధానాలు, తొందరగానే గుర్తింపు, తక్షణ చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభం వాయు కాలుష్యమేనని, తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రతి సంవత్సరం ఇది మరింత తీవ్రమవుతుందని యూకేలో పనిచేస్తున్న భారతీయ మూలాలున్న ఊపిరితిత్తుల వైద్యుడు హెచ్చరించారు. శ్వాసనాళ వ్యాధుల “సునామీ” ముందుకొస్తున్నప్పటికీ, అవి పెద్ద ఎత్తున గుర్తించబడకుండా, చికిత్స పొందకుండా ఉన్నాయని తెలిపారు.
గత దశాబ్దంలో గుండె సంబంధిత వ్యాధులు పెరగడానికి ప్రధాన కారణం ఊబకాయం మాత్రమే కాదని, ముఖ్యంగా నగరాల్లో వాహనాలు, విమానాల నుంచి వెలువడే విష వాయువులకు ఎక్కువగా గురికావడమేనని వారు పేర్కొన్నారు. డిల్లీలో సుమారు 40 శాతం కాలుష్యం రవాణా రంగం వల్లేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించి, బయో ఇంధనాల వంటి శుభ్రమైన ప్రత్యామ్నాయాలను వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో, అధిక AQI స్థాయిలు నేరుగా ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమనే స్పష్టమైన డేటా లేదని ప్రభుత్వం తెలిపినా, వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులను ప్రేరేపించే అంశాల్లో ఒకటని అంగీకరించింది. లివర్‌పూల్‌లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్‌గా పనిచేస్తున్న, భారత్ ఆరోగ్య శాఖ కోవిడ్-19 సలహా కమిటీ మాజీ సభ్యుడు డా. మనీష్ గౌతమ్ మాట్లాడుతూ, “వాయు కాలుష్యాన్ని నియంత్రించడంపై ప్రభుత్వ దృష్టి అవసరమే, ఆలస్యమైనదీ. కానీ ఉత్తర భారతదేశంలో నివసిస్తున్న కోట్ల మందికి నష్టం ఇప్పటికే జరిగిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నది మంచుకొండ పైభాగం మాత్రమే” అన్నారు.
డిసెంబరులో మాత్రమే ఢిల్లీలోని ఆసుపత్రుల్లో శ్వాసకోశ సమస్యలతో వచ్చే రోగులు 20–30 శాతం పెరిగారని, వీరిలో తొలిసారి వ్యాధి బారిన పడిన యువకులు కూడా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాలుష్య నియంత్రణ చర్యలు అవసరమైనవే అయినా, అవి ఒక్కటే సరిపోవని గౌతమ్ అన్నారు. “క్షయవ్యాధిని తగ్గించడంలో భారత్ పెద్ద ఎత్తున ప్రజారోగ్య కార్యక్రమాలు అమలు చేసి విజయవంతమైంది. అదే స్థాయిలో శ్వాసనాళ వ్యాధులపై కూడా అత్యవసరత, పెట్టుబడి అవసరం” అని పేర్కొన్నారు.
తలనొప్పి, అలసట, తేలికపాటి దగ్గు, గొంతు మంట, జీర్ణ సమస్యలు, కళ్ల ఎండదనం, చర్మ దద్దుర్లు, తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు వంటి లక్షణాలను చాలామంది చిన్నవిగా భావిస్తారని, కానీ అవి తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల తొలి సంకేతాలు కావొచ్చని ఆయన తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో ఢిల్లీలో 2 లక్షలకుపైగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి కేసులు నమోదయ్యాయని, దాదాపు 30 వేల మందికి ఆసుపత్రి చికిత్స అవసరమైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది.
బర్మింగ్‌హామ్‌లోని మిడ్‌ల్యాండ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ డెరిక్ కానోలీ మాట్లాడుతూ, బయటికి శుభ్రంగా కనిపించే రోజుల్లో కూడా కాలుష్య నగరాల్లో నివసించే వారు కనిపించని గుండె ప్రమాదాలకు గురవుతారని చెప్పారు. “గుండె వ్యాధి నెమ్మదిగా ఎదిగే నిశ్శబ్ద హంతకుడు. సూక్ష్మ కణాలు కనిపించవు, సులభంగా కొలవలేం” అన్నారు.
Also Read:‘గత వైభవం’..రిలీజ్ డేట్

