ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అసలే అభ్యర్థులు లేక సతమతమౌతున్న కమలంపార్టీకి గ్రూప్ తగాదాలు మరింత కలవర పెడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలం అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. దాంతో జిల్లాలో ఈసారైనా సత్తా చాటలని చూస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల కుమ్ములాటలు ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. అసలే అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉన్న ఒక్కరిద్దరు నేతలు కూడా టికెట్ల కోసం గ్రూప్ వార్ కు దిగుతున్నారు..
ముఖ్యంగా మునుగోడు, భువనగిరి, నాగార్జున సాగర్ వంటి నియోజిక వర్గాల్లో ప్రస్తుతం ఉన్న పార్టీ నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. భువనగిరి నియోజిక వర్గం నుంచి పోటీ చేసేందుకు గూడూరు నారాయణ రెడ్డి, జీట్టా బాలకృష్ణ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికీ టికెట్ దక్కిన మరొకరు పార్టీ మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మునుగోడు విషయానికొస్తే అక్కడ ఎంతో కొంత ప్రభావం ఉన్న నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బైపోల్ తరువాత పూర్తిగా డీలా పడ్డారు. ప్రస్తుతం నియోజిక వర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
దీంతో మునుగోడు స్థానంలో బరిలో దించేందుకు మరో నేతకోసం వెతుకులాట ప్రారంభించిందట కాషాయ అధిష్టానం. ఇక నల్గొండ లో మాదగొని శ్రీనివాస్ గౌడ్, కన్మంత్ రెడ్డి శ్రీదేవి, వంటి వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక నాగార్జున సాగర్ బైపోల్ లో పోటీకి దిగిన రవినాయక్ మళ్ళీ బరిలో దించే సాహసం చేస్తుందా అంటే చెప్పడం కష్టమే. అయితే జిల్లాలో ప్రస్తుతం పార్టీ తరుపున పేర్లు వినిపిస్తున్న వారు ఎన్నికల సమయానికి ఎంతవరకు కొనసాగుతారనేది కూడా ప్రశ్నార్థకమే. తాజా పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల సమయానికి కమలం పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read:Niranjan Reddy:ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం