కోవిడ్‌తో చనిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డెప్యూటీ డీఎంహోచ్‌ఓ డాక్టర్ నరేష్ భార్య పావనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం జీఓ కాపీని అందించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉద్యోగం కల్పించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ఈ ఉద్యోగం ఇప్పించారని, కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైద్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మానవతా కోణంలో ఆలోచించి తనకు గెజిటెడ్ ఉద్యోగం ఇచ్చినందుకు డాక్టర్ నరేష్ భార్య పావని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కి ధన్యవాదములు తెలిపారు.
భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ జి.నరేశ్‌కుమార్ కొవిడ్ మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే. మణుగూరు క్వారంటైన్ ఇంఛార్జిగా విధులు నిర్వహిస్తోన్న సమయంలో నరేశ్ కరోనా భారిన పడ్డారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చేరారు. కరోనా పాజిటివ్‌గా వచ్చినా వారం రోజులకే నరేశ్ పరిస్థితి తీవ్రంగా మారింది. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. వైద్యుడి కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పట్లోనే హామీ ఇచ్చిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ మేరకు డాక్టర్ నరేశ్ భార్యకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం కల్పించారు. గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు వెలువరించింది.