బాహుబలి యూనిట్ ముహూర్తం చూసుకుని సినిమా విడుదలను నిర్ణయిస్తే…వారి సెంటిమెంట్లు దెబ్బతీయడం మంచిది కాదని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. తెలంగాణలో ఐదు షోలకు అనుమతిని ఇచ్చామని… బెనిఫిట్ షోల ప్రదర్శనకు అనుమతి లేదని, నిబంధనలను పట్టించుకోకుండా ఎవరైనా ముందస్తుగా షోలు ప్రదర్శించినా, టికెట్ల ధరలు పెంచినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజాగా తెలంగాణలో ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ సినిమా బెనిఫిట్ షో వేసుకోవాలంటే మాత్రం ఒక విధంగా చేయాలని షరతు విధించారు. ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ సినిమాను దర్శక, నిర్మాతలు ఏప్రిల్ 28న విడుదల చేస్తామని ఐదు నెలల ముందే ప్రకటించారని గుర్తు చేశారు. వారు తమ సినిమాను బెనిఫిట్ షోలుగా వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నామని సినిమాటోగ్రఫీ శాఖతో పాటు, ధియేటర్లు ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లకు లేఖలు ఇవ్వాలని సూచించారు.
అలా కాకుంటే…తమ సినిమాను ఏప్రిల్ 28న కాకుండా…ఏప్రిల్ 27న రాత్రి షోతో విడుదల చేస్తున్నామని ప్రకటించాలని, అలా ప్రకటిస్తూ తమకు లేఖలు ఇవ్వాలని సూచించారు. ఈ రెండింట్లో ఏది జరిగినా తెలంగాణలో బెనిఫిట్ షోల నిర్వహణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా కాంబో ప్యాక్ పేరుతో అధిక ధరకు టికెట్లను అమ్మితే ఆ థియేటర్లపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు మంత్రి.
తాజాగా బాహుబలి టీం ప్రభాస్‌కు సంబంధిచిన ఈ పోస్టర్ విడుదల చేసింది.