నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈకార్యక్రమంలో విద్యార్దులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గోన్నారు. 3వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మల్లాపూర్ కార్పొరేటర్ పి.దేవేందర్ రెడ్డి, డీపీఎస్ చైర్మన్ ఎం.కొమురయ్య, శాట్స్ చైర్మన్ ఏ.వెంకటేశ్వర్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ ఎస్.రాఘవేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ సునీతా రావ్ విద్యార్థుల చేత గ్రీన్ ఛాలెంజ్ ప్రతిజ్ఞ చేయించారు.
ప్రతీ ఒక్క విద్యార్థి చేతిలో మొక్కను చేబూని హరిత తెలంగాణకు ప్రతిజ్ఞ చేశారు. . మొక్కలు నాటడం ద్వారా ఆకుపచ్చ తెలంగాణకు కృషి చేస్తూ దేశంలోనే అత్యంత పర్యావరణ అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కృషిని ప్రశంసిస్తూ ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లోని పాఠశాలలకు విస్తరించాలని శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించే బాధ్యత స్వీకరించాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవేంద్ర కోరారు.