పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

275
mlc Elections Counting
- Advertisement -

తెలంగాణలో ఈ నెల 22న ఒక పట్టభద్రుల నియోజకవర్గం, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈఎన్నికలకు సంబంధించిన కౌటింగ్ ను ఇవాళ చేయనున్నారు. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల బ్యాలెట్ బాక్సులను కరీంనగర్‌లో.. నల్లగొండ- వరంగల్- ఖమ్మం నియోజకవర్గాల బాక్సులను నల్లగొండలో భద్రపరిచారు. కరీంనగర్‌లోని ఇండోర్ స్టేడి యం, నల్లగొండ దుప్పలపల్లి వేర్‌హౌసింగ్ గోదాంలో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటగా అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌బాక్స్‌లను తెరచి ఆయాకేంద్రాల పీవో లు అందజేసిన పత్రాల్లోని ఓట్ల సంఖ్యకు బ్యాలెట్ బాక్స్‌లోని ఓట్లు సరిగ్గా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. ముందుగా ఆయా అభ్యర్థులకు వచ్చిన తొలి ప్రాధాన్య ఓట్లను.. చెల్లుబాటు కాని ఓట్లను వేరుగా చేసి లెక్కిస్తారు.

కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది పోటీపడగా… 1,15,458 మంది ఓటర్లున్నారు. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు పోటీ చేయగా మొత్తం 19,349మంది ఓటర్లు ఉన్నారు. నల్లగొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయనియోజకవర్గం నుంచి తొమ్మిది మంది బరిలో ఉండగా.. 18,886 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపుకోసం ఒక్కోనియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్‌పత్రాలపై ఓటును 1,2,3 ప్రాధాన్య క్రమంలో వేయడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం కూడా ప్రాధాన్యతాక్రమంలోనే తేలనున్నది. ఎక్కువ ఓట్లు పోలైన పట్టభద్రుల నియోజకవర్గం ఫలితం ఆలస్యం కానున్నది.

మొ దటి ప్రాధాన్య క్రమంలో స్పష్టమైన మెజార్టీరాకుంటే.. రెండు, మూడు ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఫలితం వెలువడే వరకు అర్ధరాత్రి అవుతుంది. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం వరకు వెలవడనున్నాయి. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఇప్పటికే సిబ్బందికి రెండుదఫాలుగా శిక్షణనిచ్చారు. కరీంనగర్, నల్లగొండ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటుచేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధుల మధ్య ఉండగా..ఇరు పార్టీల నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -