ఇవాళ భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు గవర్నర్ తమిళి సై. ఉదయం భద్రాచలం దేవస్థానంలో జరిగే సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై హాజరుకానున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు.
అనంతరం భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించే గిరిజన మహిళల సంప్రదాయ సీమంతం వేడుకకు హాజరవుతారు. తర్వాత ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తనిధిని గవర్నర్ సందర్శించి దాని పనితీరును సమీక్షిస్తారు.
అలాగే తన పర్యటనలో భాగంగా దమ్మాయిపేట మండలం నాచారం గ్రామం జగదాంబ సహిత జయలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం పూసుకుంట కొండరెడ్డి గిరిజన ఆవాసాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌ను గవర్నర్ తమిళిసై సందర్శిస్తారు.