రక్తదానం చేసి ఎన్నో విలువైన జీవితాలను కాపాడుతున్న రక్తదాతలందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. వరల్డ్ బ్లడ్ డోనర్ డే-2021 సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రెడ్ క్రాస్ ప్రతినిధులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్ భవన్ నుండి సమీక్ష నిర్వహించారు.రక్తదానం అంటే జీవన దానమే అని గవర్నర్ అన్నారు.
రక్తదాతల సేవలను గుర్తించి వారిని అభినందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.కోవిడ్ సంక్షోభం రక్త నిల్వలు, రక్తదానం పై కూడా ప్రభావం చూపుతుందని, ప్రస్తుతం రక్త నిల్వలు సరిపడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని డాక్టర్ తమిళిసై అన్నారు.యువతలో సరైన అవగాహన కల్పించినప్పుడు వారిని రక్తదానం వైపు ప్రోత్సహించడం సులువు అవుతుందని గవర్నర్ వివరించారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో మంచి జాగ్రత్తలతో, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని, అలాగే రక్త దాతలలో మరింత స్ఫూర్తిని పెంపొందించాల్సి ఉంటుందని డాక్టర్ తమిళిసై సూచించారు.రోజుకు దాదాపు 600 బ్లడ్ యూనిట్స్ సరఫరా చేసి తలసీమియా వ్యాధి బారిన పడిన చిన్నారులను రక్షిస్తున్న తెలంగాణ రెడ్ క్రాస్ సేవలను గవర్నర్ అభినందించారు.
రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, రక్తదానం పట్ల అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించడం అత్యంత ఆవశ్యకమని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, కోవిడ్ సంక్షోభ సమయంలో, ఇతర విపత్తుల, సంక్షోభ సమయాలలో తెలంగాణ రెడ్ క్రాస్ శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయమని గవర్నర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తెలంగాణ శాఖ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ మదన్ మోహన్ రావు, బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ కె పిచ్చి రెడ్డి, వివిధ జిల్లాల రెడ్ క్రాస్ బాధ్యులు పాల్గొన్నారు.గవర్నర్ సెక్రెటరీ కె. సురేంద్రమోహన్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.