ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. అవినీతి రహిత, పారదర్శకతతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని చెప్పారు. 108కి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలందరికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు.
నవరత్నాలను అమలు చేస్తామని చెప్పారు. టెండర్లపై జ్యూడీషియల్ కమిషన్ వేస్తామని తెలిపారు. ప్రజాసేవకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తామన్నారు. దశల వారీగా మద్యాన్ని నిషేదిస్తామని చెప్పారు. ఇందుకోసం తొలిదశలో బెల్ట్ షాపులను రద్దు చేస్తామన్నారు. గ్రామ వాలంటీర్లను నియమించి ఇంటింటీకి సంక్షేమ పథకాలు చేరేలా చూస్తామన్నారు.
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ఏటా జనవరిలో ప్రకటిస్తామన్నారు. యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని… పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాల్లో యువతకు శిక్షణ ఇస్తామన్నారు. పాడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన గవర్నర్…. రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12,500 అందిస్తామన్నారు.
అమ్మఒడి పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థికసాయం చేస్తామని చెప్పిన గవర్నర్.. బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.