సోమవారం ఉదయం 10 గంటలకు జాతీయ గీతాలాపనతో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు అసెంబ్లీ హాలులో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగించారు. అసెంబ్లీ ప్రాంగణంలో గవర్నర్‌కు శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వేదాంత నరసింహాచార్యులు స్వాగతం పలికారు.
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ దేశంలో కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమే అయినప్పటికీ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచిందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఎన్నో సవాళ్లను తెలంగాణ రాష్ట్రం అధిగమించిందని, కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తామని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, గొర్రెల పంపిణీ, కల్యాణ లక్ష్మీ, రైతులకు రుణమాఫీ తదితర పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నామని గవర్నర్ నరసింహన్ అన్నారు.
రాష్ట్ర GDP దేశంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని చెప్పారు గవర్నర్ నరసింహన్. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు గవర్నర్ నరసింహన్. రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, 100 మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ ప్రారంభించామని..మత్య్సకారుల సంక్షేమానికి చాలా చర్యలు తీసుకున్నామన్నారు. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం పయనిస్తోందన్న గవర్నర్.. 1664 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పవర్ లూమ్ కార్మికుల రుణాలు మాఫీ చేశామని తెలిపారు గవర్నర్ నరసింహన్.తెలంగాణ రాష్ట్ర సోలార్ పాలసీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. మిషన్ భగీరథ పనులు 95 శాతం పూర్తయ్యాయని..మెట్రో రైలులో సదుపాయాలు ప్రపంచస్థాయిలో ఉన్నాయన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ సాధిస్తుందని గవర్నర్ నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.టీఎస్‌ఐపాస్‌తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని, ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, ఐటీ హబ్‌లతో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని గవర్నర్ నరసింహన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. త్వరలోనే టీహబ్-2ను ప్రారంభిస్తున్నామని, బుద్వేల్‌లో ఐటీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం పూర్తైన అనంతరం సభ రేపటికి వాయిదాపడింది. మార్చి 15న మంత్రి ఈటల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.