గత మూడురోజులుగా మాదాపూర్ హెచ్.ఐ.సి.సిలో జరుగుతున్న ప్రపంచ విత్తన సదస్సు నేటితో ముగియనుంది. విత్తన ఉత్పత్తి రంగంలో వస్తున్న మార్పులు, నూతన అవిష్కరణలపై ఇస్టా కాంగ్రెస్ చర్చించింది. ఈ సదస్సుకు 80 దేశాల నుండి ప్రతినిధులు హాజరైయ్యారు. ఈ రోజు జరిగే ఇస్టా కాంగ్రెస్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరైయ్యారు. అలాగే వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ కొండబాల ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. అన్నిటికంటే ముందు విత్తనం.. విత్తనం లేకుండా ఉత్పత్తి అసాధ్యం.. జనాభా పెరుగుతున్న నేటి రోజుల్లో ఆహార భద్రత ప్రధాన సమస్యగా మారిందని ఆయన అన్నారు. ఆహార భద్రత కావాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలి.పెరుగుతున్న పారిశ్రామికీకరణతో పంటల సాగు తగ్గుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలే తప్ప లాభాలు లేని పరిస్థితి వచ్చింది.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరముంది.అప్పుడే వలసలు అగుతాయి. వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది.రైతుల ఆదాయం పెరగాలంటే నాణ్యమైన విత్తనాలు అవసరం.కల్తీ విత్తనాలు నష్టం చేస్తున్నాయి.కల్తీ విత్తనాలను అరికట్టేందు తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ తెలంగాణకే కాదు విత్తనాలకి రాజధానిగా మారింది. మంచి విత్తనం, మంచి పొలం ఉంటే రైతు సంతోషంగా ఉంటాడు రైతు సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉన్నట్టే..అని గవర్నర్ నరసింహన్ తెలిపారు.