“రాజ్ భవన్ అన్నం” క్యాంటీన్‌ను ప్రారంభించిన గవర్నర్..

133
Governor
- Advertisement -

గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఈరోజు “రాజ్ భవన్ అన్నం” పేరిట రాజ్ భవన్ కమ్యూనిటి హాల్ లో క్యాంటీన్ ప్రారంభించారు. ఈ రాజ్ భవన్ అన్నం క్యాంటీన్ ద్వారా రాజ్ భవన్ స్కూల్లో చదివే విద్యార్ధులకు, రాజ్ భవన్ లో పనిచేసే సానిటేషన్, గార్డెనింగ్ లాంటి పనులు చేసే సిబ్బందికి ప్రతిరోజూ ఉచిత అల్పాహారం అందిస్తారు. ఉచిత, బలవర్ధకమైన అల్పాహారం అందించాలన్న గవర్నర్ సంకల్పానికి, శ్రీ సత్య సాయి సేవా సమితి ముందుకు వచ్చి ఈ కార్యంలో భాగస్వామ్యం తీసుకుంది.

ఈ క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం, గవర్నర్ దంపతులు రాజ్ భవన్ పాఠశాల విద్యార్ధులు, సిబ్బంది, సానిటేషన్ వర్కర్లకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. వారితో కలిసి అల్పాహారం తిన్నారు.గవర్నర్ డా. తమిళిసై, ఆమె భర్త ప్రముఖ నెఫ్రాలజి వైద్య నిపుణులు డా. పి. సౌందరరాజన్ స్వయంగా అల్పాహారం వడ్డించడం, విద్యార్ధులు, సిబ్బంది మధ్య కూర్చుని అల్పాహారం తినడంతో విద్యార్ధులు, సానిటేషన్ వర్కర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి.

“బాగుంది, చాలా బాగుంది” అంటూ “మంచిగా తినండి, మంచిగా చదువుకోండి” అంటూ విద్యార్ధులను గవర్నర్ ఉత్సాహపరిచారు. రోజుకు ఒక టిఫిన్ చొప్పున, వారం పాటు పోషక విలువలున్న అల్పాహారాన్ని విద్యార్ధులకు, సానిటేషన్ సిబ్బందికి అందిస్తామని సత్య సాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఎ. మల్లేశ్వర్ రావు తెలిపారు. గవర్నర్ గారి ఆలోచనలకు ప్రతి రూపం కల్పిస్తూ ఈ “రాజ్ భవన్ అన్నం” కేంద్రం ద్వారా ఉచిత, బలవర్ధక ఆహారం అందించడం సత్య సాయి సేవా సమితికి గర్వకారణంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. విద్యార్ధులకు ఉదయం బలవర్ధకమైన పోషకాహారాన్ని అందించడం కీలకమన్నారు. ఇది వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. వారి అకడమిక్ ప్రతిభ కూడా మెరుగవుతుంది, వారి డ్రాపవుట్ రేట్ తగ్గుతుంది. నూతన జాతీయ విద్యా విధానం- 2020 ద్వారా కూడా దేశవ్యాప్తంగా పాఠశాల పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందించే విధానం అందుబాటులోకి వస్తుంది.చాలామంది పిల్లల లంచ్ బాక్స్ లో చిప్స్, ఇతర ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఉంటున్నాయి. సరైన పోషకాహారంతో కూడిన లంచ్, బ్రేక్ ఫాస్ట్ విద్యార్ధులకు అందించాలి.

తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రులు కామరాజ్ నాడార్, ఎంజీ రాంచంద్రన్ లు మధ్యాహ్న భోజనం, అల్పాహారం పాఠశాలల్లో ప్రవేశపెట్టడంతో అక్కడ విద్యార్ధుల ప్రవేశాల సంఖ్య పెరిగింది, మంచి ఫలితాలు వచ్చాయి అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ టు గవర్నర్ కె. సురేంద్రమోహన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభ సూచకంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.

- Advertisement -