ప్రగతిపథంలో తెలంగాణ..

231
Governor ESL Narasimhan Republic Day speech
- Advertisement -

తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుందన్నారు గవర్నర్ నరసింహన్‌. 69వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన గవర్నర్ తెలంగాణ ఏర్పడిన అతికొద్దికాలంలోనే విద్యుత్ సంక్షోభాన్ని అదిగమించిందని తెలిపారు. సంక్షేమ పథకాల కోసం రూ. 40 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.

ఈ ఏడాది బడ్జెట్ నుంచి రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడుతోందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశామని కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణ సాగునీటి కష్టాలు తీరినట్లేనని తెలిపారు.

వృద్దులు,వితంతువులతో పాటు దివ్యాంగులకు పించన్ అందిస్తున్నామని తెలిపారు. భూరికార్డుల ప్రక్షాళనతో పాటు రైతులకు త్వరలోనే పాస్ పుస్తకాలు అందచేస్తామని తెలిపారు. అంగన్ వాడీ,ఆశావర్కర్లు,హోంగార్డుల జీతాలు పెంచామని తెలిపారు. యాదవ,గొల్ల కురుమల సంక్షేమానికి పెద్దపీట వేశామన్న గవర్నర్ రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణి పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.

చేనేత కార్మికులతో పాటు మత్య్స కార్మికుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాయిబ్రాహ్మణుల కోసం అధునాతన సెలూన్‌లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. కేజీ టూ పిజీ విద్యతో పాటు 522 కొత్త గురుకులాలను ప్రారంభించామన్నారు. నాణ్యమైన విద్య అందరికి అందాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు మహార్ధశ వచ్చిందన్నారు. 102,104,108 సర్వీసులు మెరుగుయ్యాయని..కేసీఆర్‌ కిట్‌లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. రూ. 40 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తెలంగాణకు హరితహారంతో ఇప్పటివరకు 80 కోట్ల మొక్కలను నాటామని చెప్పారు.

పాలనలో అవినీతిని రూపుమాపామని అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌తో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఐటీలో తెలంగాణ మొదటి స్ధానంలో ఉందని వరంగల్,కరీంనగర్ లాంటి నగరాలకు ఐటీ కంపెనీలను విస్తరిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్దిలో ముందుకు సాగుతు దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతోందన్నారు గవర్నర్.

- Advertisement -