తెలుగులో వెబ్ సైట్ లేదా బ్లాగ్‌ను రన్ చేస్తున్న వారికి శుభవార్తను తెలిపింది గూగుల్. ఇప్పటివరకు ఇంగ్లీష్‌తో పాటు కొన్ని భాషలకే పరిమితమైన గూగుల్ యాడ్ సెన్స్ సపోర్ట్‌ను తెలుగు వెబ్ సైట్లకు కూడా అందిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా వెబ్ సైట్ యజమాని వివిధ కంపెనీల ప్రకటనలను తన సైట్‌లో గూగుల్ ద్వారా పబ్లీష్ చేయడంతో ఆదాయాన్ని పొందవచ్చు. మల్టీనేషనల్ కంపెనీలతో సహా పేరు మోసిన కంపెనీలు తమ బ్రాండ్ అడ్వర్టయిజ్‌మెంట్ కొరకు గూగుల్‌తో ఒప్పందం చేసుకుంటాయి. మన సైట్‌కు వచ్చే విజిటర్స్,ఇంప్రెషన్స్ ద్వారా గూగుల్ యాడ్స్ ఇస్తుంది. ఇందులో గూగుల్ 32 శాతం తీసుకోగా 68 శాతం పబ్లిషర్‌లకి లభిస్తుంది.
సో ఇకపై వెబ్‌సైట్‌లు రన్ చేస్తున్న వారు మార్కెటింగ్ వ్యక్తుల ద్వారానే కాకుండా గూగుల్ నుంచి వచ్చే యాడ్స్ ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. ఇదే విషయాన్ని ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో ఆ కంపెనీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. గూగుల్ యాడ్‌సెన్స్ సపోర్ట్‌ను ఇకపై తెలుగు బ్లాగ్‌లు, వెబ్‌సైట్లకు కూడా అందిస్తున్నామని తెలిపారు.తెలుగుతో పాటు హిందీ,బెంగాలీ,తమిళంలో వెబ్ సైట్స్,బ్లాగ్స్ రన్ చేసేవారు గూగుల్ యాడ్ సెన్స్‌ను పొందవచ్చన్నారు.
అయితే,ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఇప్పటివరకు తెలుగుకు గూగుల్ యాడ్ సెన్స్ లేకపోవడంతో కొన్ని వెబ్‌సైట్లు..ఇతర సైట్ల నుంచి కంటెంట్ మక్కికి మక్కి కాపీ చేసి తమ సైట్లలో పెట్టేవారు. ఇకపై అది కుదరదు. ఒకవేళ కాపీ చేస్తే సంబంధిత సైట్ ఓనర్లు కాపీ రైట్ వేయవచ్చు.దీంతో కంటెంట్‌ను కాపీ చేసే సైట్ల యాడ్ సెన్స్ రద్దుఅవుతుంది.