సచ్చ సౌధ చీఫ్, రాక్‌స్టార్ బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్ రేప్ కేసులో దోషిగా తేలి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇన్నాళ్లు రాజభోగాలు అనుభవిస్తూ విలాసవంతమైన ఆశ్రమంలో గడిపిన బాబా.. ఒక్కసారిగా జైలుకు వెళ్లడంతో అక్కడి వాతావరణం ఒంటబట్టక తొలి రోజు నిద్రలేని రాత్రి గడిపారట.
ప్రస్తుతం హర్యానాలోని సునారియాలో ఉన్న రోహ్‌తక్ జిల్లా జైలులో రామ్ రహీమ్ ఉన్నారు. ఆయనకు ఖైదీ నం. 1997 కేటాయించారు. శుక్రవారం జైలు లాంఛనాలన్నీ ముగిసిన తరవాత రాత్రి 8.30 గంటలకు డేరా బాబా తన బ్యారెక్స్‌లోకి వెళ్లినట్లు జైలు అధికారులు వెల్లడించారు.
జైలు అధికారుల సమాచారం మేరకు.. బ్యారెక్స్‌లోకి వెళ్లిన తరువాత ఆరోజు రాత్రి ఒక చపాతి, గ్లాసుడు పాలు మాత్రమే డేరా బాబా తీసుకున్నారట, రాత్రంతా నిద్రపోకుండానే బ్యారెక్స్‌లో అటూ ఇటూ తిరుగుతూ… శనివారం తెల్లవారుజామున ఒక గంటపాటు యోగా చేసిన అనంతరం 5 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించారట.
అయితే జైల్లో డేరా బాబాకు వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నట్లు వచ్చి వార్తల్లో నిజం లేదని జైలు అధికారులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం 3.30 గంటలకు సునారియా జైలుకు రామ్ రహీం వచ్చారని, అన్ని లాంఛనాలు ముగిసిన తరవాత సాధారణ ఖైదీలానే ఆయన్ను బ్యారెక్స్‌లోకి పంపామని చెప్పారు. ఇదిలా ఉండగా.. సోమవారం డేరా బాబాకు జైలు శిక్ష ఖరారు కానుంది. రామ్ రహీమ్‌కు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు అంటున్నారు.