ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద 43.5 అడుగులకు నీటి మట్టం చేరడంతో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.ఈ ఏడాది లో గోదావరికి గరిష్ట వరద నీరు శుక్రవారం రాత్రి 41. 80 అడుగులు ఉండగా శనివారం ఉదయానికి 43.5 అడుగులకు చేరింది నీటి మట్టం.
వరద ఉద్ధృతి కి స్నాన ఘట్టాలు నీట మునిగాయి. విద్యుత్ స్తంభాలు, భక్తులు దుస్తులు మార్చుకునే గదులు వరద నీటిలో మునిగిపోయాయి. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు.
గోదావరికి వరద ఉద్ధృతి పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ శైని ఆదేశాలు జారీ చేశారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులకు గోదావరి లోపలికి అనుమతి నిరాకరించారు.ఎగువప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నందున భద్రాచలం వద్ద నీటి మట్టం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఇక మరోవైపు జూరాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో-2.17 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో-2.19 లక్షల క్యూసెక్కులు. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో-33వేల క్యూసెక్కులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం-10.6985 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలుగా ఉంది.