జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు హాజరైన విద్యార్థినులు పలువురు కఠినమైన ‘డ్రెస్ కోడ్’ వల్ల దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. దీంతో సజావుగా జరగాల్సిన పరీక్ష ‘నీట్’గా జరగలేదు. పరీక్షలకు ముందు హాళ్ల వెలుపల గందరగోళం నెలకొంది. విద్యార్థులను పరీక్ష హాల్ బయటనే నిలబెట్టి వస్త్రధారణ, అలంకరణల గురించి అధికారులు వివరించి , వాటిని పాటించిన తరువాతనే విద్యార్థులను లోపలికి అనుమతించారు.
చెవికమ్మలు, ముక్కుపుడకలను కూడా తీసి భద్రపర్చుకోవల్సి వచ్చింది. విద్యార్థులు వెంట తెచ్చుకున్న పెన్సిల్, పెన్నులను కూడా లోపలికి అనుమతించలేదు. పరీక్షహాల్‌లోనే వీటిని అందిస్తారనే నిబంధన పెట్టారు. మాల్‌ప్రాక్టిస్‌లు లేకుండా కటుతరమైన నిబంధనలను పెట్టారు. అభ్యర్థులకు అనుమతి కార్డు ఉంటేనే లోపలికి రానిచ్చారు.
ఇక కేరళ కన్నూర్ లోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికి వెళ్ళిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్షలకు కూర్చొనే ముందే బ్రా తొలగించి రావాలని ఆదేశించారు. ఒకవేళ బ్రా తొలగించకపోతే పరీక్షను రాయబోనివ్వమని హెచ్చరించారు. ఈ కొత్త రకం ఆంక్షల కారణంగా విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. ఈ నిబంధన విన్న విద్యార్థిని ఆశ్చర్యపోయింది.పరుగున బయటకు వచ్చేసింది. తన చేతిలో టాప్ ఇన్నర్ వేర్ పెట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తల్లి ఆవేదనతో చెప్పింది.
పరీక్ష అనంతరం ఆ విద్యార్థిని ఆగ్రహంతో ఊగిపోతూ ఈ విషయాన్ని మీడియాకు చెప్పింది.ఉమ్మడి సార్వత్రిక ప్రవేశపరీక్షలలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుందని అభ్యర్థులు అక్రమ పద్ధతులలో పరీక్షలు రాస్తారనే అనుమానాలతో నీట్ కొత్త నిబంధనలు విధించింది. అయితే వీటి గురించి తెలియని విద్యార్థులు నానా ఇక్కట్లకు గురయ్యారు. పలు చోట్ల యువకులు ఫుల్ షర్టులు, బూట్లు కొందరు కుర్తా పైజామాలతో పరీక్షలకు వచ్చారు.
అయితే కేవలం పొట్టి చేతుల షర్టులతోనే రావాలనే నిబంధన ఉందని , బూట్లు వేసుకోరాదని కూడా చెప్పడంతో విద్యార్థులు చాలా మంది పరీక్షకు హాజరుకావడానికి మిగిలిన పావుగంట వ్యవధిలోనే కత్తెరలతో తమ పొడవాటి షర్టులను పొట్టి చేసుకున్నారు. బూట్లను వదిలేసిలోపలికి వెళ్లారు. దీంతో పరీక్ష నిర్వహణపై విద్యార్ధుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.