రష్మి సినీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్, రోణిక సింగ్ హీరో హీరోయిన్లుగా అరుంధతి శ్రీను దర్శకత్వంలో జె.వీరేష్ నిర్మిస్తున్న చిత్రం ‘గిల్లి-దండా’. ఈ చిత్రం శనివారం 29-7-2017 హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అతిరథ మహారధుల మధ్య ప్రారంభమైంది. ప్రముఖ దర్శకనిర్మాత వైవిఎస్ చౌదరి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్ర స్కిప్ట్‌ని నందమూరి హరికృష్ణ దర్శకునికి అందజేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్‌నివ్వగా ధరణిధర్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహుర్తపు సన్నివేశానికి నటుడు అలీ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుంధతి శ్రీను మాట్లాడుతూ..’మా చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి మమ్మల్నీ ఆశీర్వదించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే విలేజ్ బ్యాగ్రౌండ్‌లో ‘గిల్లీ-దండా’ ఆట నేపథ్యంలో సాగే ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఇది. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతుంది. నేను చెప్పిన కథ నచ్చి, ఈ చిత్రం మనమే చేద్దాం అంటూ నిర్మాత జె. వీరేష్ ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మరిచిపోలేను. రఘు కుంచె సంగీతం, జి.జె. కృష్ణ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. అందరూ మెచ్చేలా, అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది..’ అని అన్నారు.
నిర్మాత జె. వీరేష్ మాట్లాడుతూ..’ముందుగా మా యూనిట్‌ని ఆశీర్వదించడానికి ఇక్కడకు విచ్చేసిన అతిరధ మహారధులందరికీ నా నమస్కారాలు. దర్శకుడు అరుంధతి శ్రీను చెప్పిన కథ, కథ చెప్పిన విధానం నన్ను ఎంతగానో ఆట్టుకున్నాయి. మంచి కుటుంబ కథా చిత్రమిది. మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి ఆలయంలో, అనంతపురం, గుత్తి, బెంగుళూరు, హైదరాబాద్ తదితర లోకేషన్లలో చిత్రీకరణ జరుపనున్నాము. మా బ్యానర్‌లో మంచి చిత్రం అవుతుందని, అందరూ ఆశీర్వదిస్తారని..కోరుకుంటున్నాను..అని అన్నారు.
హీరో నటరాజ్ మాట్లాడుతూ..’తెలుగులో నా మొదటి సినిమా ఇది. ఇంతకు ముందు సైరత్ కన్నడ రీమేక్‌లో నటించాను. ఇంత మంచి కథతో ఇక్కడ హీరోగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు..అని అన్నారు.
హీరోయిన్ రోణిక సింగ్ మాట్లాడుతూ..’నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యావాదాలు. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది. సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను..’అని అన్నారు.
నటరాజ్, రోణిక సింగ్, సత్యప్రకాశ్, జీవా, తిరుపతి ప్రకాష్, చిత్రం శ్రీను, షకీల, మాధవి, పొట్టి రాంబాబు, అప్పారావు, జబర్ధస్త్ టీమ్ హాస్యనటులు, గబ్బర్‌సింగ్ టీం మొదలగు వారు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: జి.జె. కృష్ణ, సంగీతం: రఘు కుంచె, మాటలు: రవి, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, కో-డైరెక్టర్స్: రఘువర్ధన్ రెడ్డి మరియు నాగుల కొండ నవకాంత్, నిర్వహణ: రాంబాబు, నిర్మాత: జె. వీరేష్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అరుంధతి శ్రీను.