దేశంలోనే అగ్రస్థానంలో బల్దియా..

187
ghmc
- Advertisement -

నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోని ఇతర నగరాలకన్నా అగ్రస్థానంలో ఉంది. ఒకొక్క చిరు వ్యాపారికి రూ. 10 వేల తక్షణ సహాయం అందించడంలో భాగంగా రికార్డు స్థాయిలో 34,878 మందికి అందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు తిరిగి ప్రారంభించేలా చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. 2020 జూలై 2న ఈ పథకం ద్వారా రుణాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఈ పథకం ముఖ్యంగా చిరు వ్యాపారుల, వీధుల్లో చిన్నచిన్న షాపులు నిర్వహించేవారి కోసం ప్రకటించినదే. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు జిహెచ్ఎంసి పరిధిలో 1,62,105 మంది చిరువ్యాపారులను గుర్తించగా వీరిలో 1,57,945 మంది చిరువ్యాపారుల వివరాలను మెప్మా పోర్టల్‌లో అప్ లోడ్ చేశారు. 1,54,335 మంది చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీచేశారు.

ఈ చిరువ్యాపారుల్లో ఒకొక్కరికి రూ. 10వేలు తక్షణ సహాయం అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించగా 67,233 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో పూర్తిస్థాయిలో విచారణ జరుపగా అర్హులైన 42,911 మందికి రుణాలు మంజూరు కాగా నేటి వరకు 34,878 మందికి రుణాలను అందించడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాలకన్నా అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాత ఇండోర్ నగరం 34,855 చిరువ్యాపారులకు రుణాలను అందించడం ద్వారా ద్వితీయ స్థానంలో నిలువగా 34,195 మందికి రుణాలను అందించడం ద్వారా లక్నో నగరం తృతీయ స్థానంలో, కాన్పూర్ నగరం (32,751) నాలుగో స్థానంలో, వారణాసి (27,023) ఐదో స్థానంలో నిలిచింది. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోని చిరువ్యాపారులు తమ లావాదేవీలను డిజిటల్ పద్దతిలో చేసేందుకు కూడా జిహెచ్ఎంసి ప్రత్యేక కృషి చేపట్టింది. బీమ్, పేటీఎం, గూగుల్ పే, భారత్ పే, ఫోన్ పే, అమెజాన్ పే తదితర యాప్ ల ద్వారా తమ లావాదేవీలను చేపట్టేందుకు శిక్షణ కూడా ఇప్పించారు.

దీంతో పాటు ప్రతి ఒక్క వీధి వ్యాపారి ప్రతి నెలలో కనీసం 50 డిజిటల్ ట్రాంజాక్షన్స్ నుండి అధిక సంఖ్యలో చేసినవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా కల్పించారు. పి.ఎం స్వనిధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో పలు సమావేశాలు జరుగడం, జిహెచ్ఎంసి కమిషనర్ ప్రతి వారం జోనల్, డిప్యూటి కమిషనర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ రుణాలు అందజేసేవిధంగా బ్యాంకర్లతో తరచూ సమావేశాలు నిర్వహించడం ద్వారానే హైదరాబాద్ నగరం ముందంజలో నిలిచింది. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, పురపాలక శాఖ కమిషనర్, మెప్మా ఎండి డా.సత్యనారాయణ లు కూడా స్ట్రీట్ వెండర్స్ కు రుణాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ద చూపించారు. కాగా నగరంలో పిఎం స్వనిధి అమలుతీరును కూడా కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి కూడా నగరంలో పరిశీలించారు.

- Advertisement -