ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులను జీహెచ్ఎంసి ముమ్మరంగా చేపడుతోంది. హైదరాబాద్లో ఇటీవల వర్షాలకు సెప్టెంబర్ మాసంలో 3,606 రోడ్లపై గుంతలు ఏర్పడగా ఈ గుంతలను మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలచే జీహెచ్ఎంసి తాత్కాలికంగా ప్రయాణానికి అనువుగా ఉండేలా రోడ్లపై గుంతలను పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. జీహెచ్ఎంసిలోని 200లకుపైగా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చివేయడం, అవసరమైన మార్గాల్లో రోడ్లను పునరునిర్మించడం తదితర చర్యల్లో నిమగ్నమైంది.
కాగా రోడ్ల మరమ్మతులకు దీర్ఘకాలిక, మధ్యంతర, స్వల్పకాలిక పనులను త్రిముఖ వ్యూహంతో చేపట్టాలని జీహెచ్ఎంసి కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించడంతో ప్రస్తుతం రోడ్లను ప్రయాణానికి అనువుగా గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రధాన రహదారులపై ప్రధానంగా దృష్టి సాధించారు. మంగళవారం నాడు నగరంలో 556 గుంతలను రోడ్లపై గుర్తించగా వీటిలో 134 గుంతలను వెంటనే పూడ్చివేశారు. నేడు నిర్వహించిన సర్వేలో ఎల్బీనగర్ జోన్ లో 48, చార్మినార్ లో 72, ఖైరతాబాద్ లో 127, శేరిలింగంపల్లి జోన్ లో 88, కూకట్ పల్లి లో 53, సికింద్రాబాద్ జోన్ లో అత్యధికంగా 168 గుంతలు రహదారులపై ఏర్పడ్డట్టు ఇంజనీర్లు నిర్వహించిన తక్షణ సర్వేలో తేలింది.
మిగిలిన గుంతలను కూడా రేపటిలోగా పూడ్చివేయాలని క్షేత్రస్థాయి ఇంజనీర్లను ఆదేశించినట్లు జిహెచ్ఎంసి నిర్వహణ విభాగం చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ తెలిపారు. కాగా జూన్ మాసం నుండి సెప్టెంబర్ మాసాంతం వరకు 21,471 గుంతలను రహదారులపై పూడ్చివేశామని చెప్పారు. జూన్ మాసంలో 2,301 పాట్ హోల్స్, జూలై మాసంలో 3,944, ఆగష్టు మాసంలో అత్యధికంగా 11,720 పాట్ హోల్స్, సెప్టెంబర్ మాసంలో 3,606 పాట్ హోల్స్ లను గుర్తించి వాటిని మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలచే ఎప్పటికప్పుడు పూడ్చివేశామని చీఫ్ ఇంజనీర్ పేర్కొన్నారు. కాగా నవంబర్ 1వ తేదీ నుండి రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేతను ప్రత్యేకంగా ఇనిస్టాంట్ మరమ్మతు బృందాలను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు తెలిపారు.