గ్రేటర్‌లో ప్లాస్టిక్ ఏరివేతకు కార్యాచరణ..

384
GHMC
- Advertisement -

ప‌ర్యాట‌క ప‌రంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాంతి గాంచిన హైద‌రాబాద్ న‌గ‌రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు నగరంలోని రహదారులు, పార్కులు, పర్యాటక స్థలాలు, కాలనీలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు అక్టోబర్ 2 గాంధీ జయంతి నుండి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

బుధవారం నుండి జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా చేపట్టే ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేతకు ప్లాగింగ్ కార్యక్రమ నిర్వహణ, 50 మైక్రాన్లకన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్ల నిషేదం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం,నగరంలోని ప‌లు చారిత్ర‌క,వార‌స‌త్వ‌, ప‌ర్యాట‌క ప్రాంతాలైన చార్మినార్, గోల్కొండ‌,కులి కుతుబ్‌షా స‌మాదులు,బిర్లా మందిర్‌,మ‌క్కా మ‌సీద్‌,సాల‌ర్‌జంగ్ మ్యూజియం, శిల్పారామం,ట్యాంక్‌బండ్ త‌దిత‌ర ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేదం,ప్లాగింగ్ నిర్వహణ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా చేప‌ట్టాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది.

ghmc

నగరంలోని అన్ని కాలనీలు, పార్కులు, ప్రధాన రహదారుల్లో స్థానిక కాల‌నీ సంక్షేమ సంఘాలు, మార్నింగ్ వాక‌ర్స్ ఇత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో ప్లాగింగ్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ జోనల్, డిప్యూటి కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే న‌గ‌రంలో అక్ర‌మ బ్యాన‌ర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేదాన్ని జీహెచ్ఎంసీ ప‌టిష్టంగా అమ‌లు చేస్తోంది. దీంతో పాటు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించాలని స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా భారత ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోనూ ఈ కార్యక్రమాన్ని ఉద్యమ రూపంలో చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశిస్తూ సర్క్యూలర్ జారీచేశారు.

గాంధీ జయంతి రోజు కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, నగరవాసులను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ నిషేదంపై చైతన్య కార్యక్రమాల నిర్వహణ, క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టడం, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రతిజ్జలు, స్వచ్ఛత ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇందుకుగాను ప్రతిరోజు చేపట్టాల్సిన కార్యక్రమాలను డిప్యూటి, జోనల్ కమిషనర్లకు అందజేశారు. ప్రతిరోజు జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది, ఉద్యోగులతో ప్రతిరోజు ఒక్కో వార్డులో ప్లాగింగ్ కార్యక్రమాలను నిర్వహించాలి. ప్లాగింగ్ లో సేకరించిన ప్లాస్టిక్ ను డ్రై రిసోర్స్ సెంటర్ వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు.

ప్లాస్టిక్ ఫ్రీ సిటీ, స్వచ్ఛత-హీ-సేవా అంశాలపై పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శించడం, 50 మైక్రాన్ల కన్నా తక్కువ నిడివిగల ప్లాస్టిక్ ను ఉపయోగించే వారికి జరిమానాలు విధించడం, సేకరించిన ప్లాస్టిక్ ను సిమెంట్ కంపెనీలకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ నిడివి గల ప్లాస్టిక్ కవర్లను అధికంగా వాడే చిరు వ్యాపారులకు అవగాహన కల్పించడం, వీటిని వాడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ తెలిపింది. ప్లాస్టిక్ ఏరివేతకు చేపట్టే ప్లాగింగ్ కార్యక్రమాన్ని ఉద్యమ రూపంలో చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -