రేపటితో ముగియనున్న GHMC పాలక మండలి గడువు

4
- Advertisement -

రేపటితో ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పాలక మండలి గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్తోంది. రేపే GHMCను మూడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో హైదరాబాద్ పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, అలాగే గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ శేరిలింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌గా మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఈ మూడు కార్పొరేషన్లకు అవసరమైన కార్యాలయాలను అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుత GHMC ప్రధాన కార్యాలయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కొనసాగనుండగా, తార్నాకలోని హుడా కార్యాలయాన్ని గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్ కార్యాలయంగా వినియోగించనున్నారు. అలాగే మాదాపూర్ నాక్ భవనంలో గ్రేటర్ సైబరాబాద్ (గ్రేటర్ శేరిలింగంపల్లి) కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేశారు.

వార్డుల విభజన కూడా స్పష్టంగా నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 150 వార్డులు ఉండగా, గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్‌లో 74 వార్డులు, గ్రేటర్ సైబరాబాద్ (గ్రేటర్ శేరిలింగంపల్లి) కార్పొరేషన్‌లో 76 వార్డులు ఉంటాయి. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ జోన్లు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీ నగర్ జోన్లతో గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పడనుండగా, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్లతో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పడుతుంది.

GHMC ఎన్నికలను ఆరు నెలల లోపు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. అంటే ఆగస్టు నెలలోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటివరకు మూడు కార్పొరేషన్లను స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నిర్వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రస్తుత GHMC కమిషనర్ కర్ణన్, గ్రేటర్ మల్కాజిగిరికి వినయ్ కృష్ణా రెడ్డి, గ్రేటర్ సైబరాబాద్‌కు సృజన స్పెషల్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Also Read:క్లైమాక్స్‌లో ‘ఆకాశంలో ఒక తార’

గతంలో కేవలం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన GHMC, ORR వరకు విస్తరించడంతో ప్రస్తుతం 2050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరుకుంది. జనాభా కూడా సుమారు ఒక కోటి 34 లక్షలకు పెరిగింది. ఈ విస్తృత పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకే మూడు కార్పొరేషన్లుగా విభజన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -