సుపరిపాలన కోసమే 100 రోజుల ప్రణాళిక…

235
GHMC plan on Hyderabad development
- Advertisement -

హైదరాబాద్‌ను రాత్రికి రాత్రే విశ్వనగరంగా మార్చలేమని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని.. కచ్చితంగా హైదరాబాద్ ను విశ్వనగరంగా రూపుదిద్దుతామన్నారు.

హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దు కోవడానికి ఆరేడు ఏళ్లు పడుతుందన్నారు. ప్రస్తుతం వారసత్వంగా వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని.. యూనిఫైడ్ సర్వీసెస్ యాక్ట్ ద్వారా స్థాన చలనం చేస్తున్నామన్నారు. బిల్డింగ్ ట్రిబ్యునల్ కు సంబంధించి బిల్లు తీసుకువస్తున్నామన్నారు. తప్పకుండా చేసి చూపిస్తామన్నారు. నగరంలో 370 పెట్రోల్ బంకుల్లో టాయిలెట్ల ఏర్పాటు చేశామని తెలిపారు. 2000 స్వచ్ఛ ఆటోలు చెత్తను సేకరిస్తున్నాయని…రోడ్ల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు.

జీహెచ్‌ఎంసీ ఏర్పడినప్పటి నుంచి రోడ్ల కోసం తాము ఖర్చు పెట్టిన డబ్బు ఎవరూ ఖర్చు పెట్టలేదని గుర్తు చేశారు. రోడ్లను ఎంత వేసినా పటిష్టంగా ఉండకపోవడానికి సీవరేజ్ వ్యవస్థనే కారణమన్నారు. సీవరేజ్ వ్యవస్థను ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ నుంచి వచ్చే వ్యర్థాలతో 10 చోట్ల రహదారులు వేస్తున్నామని తెలిపారు. ఐటీ కారిడార్‌లో రూ. 200 కోట్లతో వైట్ ట్యాపింగ్ రోడ్ల కోసం టెండర్లు పిలిచామన్నారు. ఏడాది పొడవునా నాలాల్లో పూడికతీతకు టెండర్లు పిలిచామని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీలో సిబ్బంది కొరత లేదని స్పష్టం చేశారు.

- Advertisement -