మాన‌వ‌త్వాన్ని చాటుకున్న జీహెచ్ఎంసీ..

210
ghmc people
- Advertisement -

రోడ్లు, ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌లు, ఫుట్‌పాత్‌ల వంటి మౌలిక వ‌స‌తుల అభివృద్ది ప‌నుల‌ను మాత్ర‌మే కాకుండా సామాజిక అంశాల‌పై కూడా జిహెచ్‌ఎంసి స్పందించి మాన‌వ‌త్వాన్ని చాటుకుంటున్న‌ది. మ‌తిస్థిమితం కోల్పోయి ఇంటి నుండి త‌ప్పిపోయిన మ‌హిళ‌ను గుర్తించి ఆశ్ర‌యం క‌ల్పించ‌డంతో పాటు వైద్య సేవ‌లు అందించ‌డంతో ఆ మ‌హిళ 42 రోజుల త‌ర్వాత గ‌తాన్ని గుర్తు తెచ్చుకోవ‌డంతో కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించ‌డం జ‌రిగింది. దీంతో కుటుంబంలో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

వివ‌రాల్లోకి వెళితే…ఆమె పేరు మ‌హ‌బూబ్ బీ. కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్‌లోని రామాల‌య వీధిలో కొడుకుల‌తో పాటు ఉంటుంది. అయితే మ‌తిస్థిమితం కోల్పోవ‌డంతో ఇంటిని గుర్తుప‌ట్ట‌లేక మూసాపేట స‌ర్కిల్‌కు చేరుకొని రోడ్డు ప‌క్క‌న ఉన్న చెట్ల కింద అప‌స్మార‌క స్థితిలో ప‌డిపోయింది. త‌మ త‌ల్లి ఆచూకి కోసం ప్ర‌య‌త్నించిన కొడుకులు కూక‌ట్‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో కూడా ఫిర్యాదు చేశారు. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌తో ఏఒక్క‌రూ ఆక‌లితో అల‌మ‌టించ‌రాద‌ని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు జారీచేసిన ఆదేశ‌ములు, రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు సూచ‌న‌ల‌కు అనుగుణంగా న‌గ‌రంలో ఇబ్బంది ప‌డుతున్న యాచ‌కులు, అనాథ‌లు, నిరాశ్ర‌యుల‌ను గుర్తించి షెల్ట‌ర్ హోంల‌కు త‌ర‌లించేందుకై జిహెచ్‌ఎంసి స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టింది.

అందులో భాగంగా యాచ‌కులు, అనాథ‌లు, నిరాశ్ర‌యుల‌ను గుర్తించుట‌కై మార్చి 30వ తేదీన కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ వి.మ‌మ‌త‌, మూసాపేట స‌ర్కిల్ డిప్యూటి క‌మిష‌న‌ర్ ప్ర‌శాంతి ఆధ్వ‌ర్యంలో జిహెచ్‌ఎంసి బృందం రోడ్ల‌పై ఉన్న‌వారిని గ‌మ‌నిస్తున్న స‌మ‌యంలో రోడ్డు ప‌క్క‌న చెట్టును ప‌ట్టుకొని ప‌డుకున్న మ‌హిళ క‌నిపించింది. అధికారులు మ‌హిళా వ‌ద్ద‌కు వెళ్లి చూడ‌గా అప‌స్మార‌క స్థితిలో ఉన్న‌ట్లు గుర్తించారు. చుట్టుప‌క్క‌ల వారిని వివ‌రాలు అడ‌గ‌గా, ఆ మ‌హిళ గ‌త రెండు రోజులుగా చెట్టుకింద‌నే ఉంటున్న‌ద‌ని, తాము భోజ‌నం, వాట‌ర్ బాటిల్ ఇచ్చిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌డంలేద‌ని వివ‌రించారు. దీంతో అధికారులు వెంట‌నే జిహెచ్‌ఎంసి వాహ‌నం ద్వారా ఆ మ‌హిళ‌ను శివానంద పున‌రావాస కేంద్రంలో చేర్పించారు. పున‌రావాస కేంద్రంలో ఆమె ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు రెగ్యుల‌ర్‌గా ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించి వైద్య సేవ‌లు అందించారు. ఆశ్ర‌మంలో చేరిన 10 రోజుల్లోనే ఆ మ‌హిళ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డం ప్రారంభ‌మైంది.

నిర్వాహ‌కుల‌తో క‌లిసి పున‌రావాస కేంద్రంలో ఉన్న ఇత‌రుల‌కు కూడా సేవ‌లు చేయ‌డంలో పాలుపంచుకుంది. పున‌రావాస కేంద్రంలో ఉన్న వాతావ‌ర‌ణం, అధికారులు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల‌న మ‌హిళ త‌న గ‌తాన్ని గుర్తు తెచ్చుకొని త‌న పేరు మ‌హ‌బూబ్ బీ గా చెప్పింది. ఇంటి నుండి త‌ప్పిపోయిన 42 రోజుల త‌ర్వాత‌ త‌మ ఇల్లు రామాల‌యం ద‌గ్గ‌ర ఉంటుంద‌ని చెప్ప‌డంతో అధికారులు ఆ మ‌హిళ‌ను త‌మ వాహ‌నంలో వెంట‌పెట్టుకొని మూసాపేట, కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిళ్ల‌లోని వీధుల‌లో తిప్పి, త‌మ ఇంటిని గుర్తుప‌ట్టాల‌ని కోరారు. కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్ రామాల‌యం వీధిలో వెళుతున్న స‌మ‌యంలో ఒక ఇంటి ముందు ఉన్న కొడుకుల‌ను మ‌హ‌బూబ్ బీ గుర్తుప‌ట్టింది. దీంతో అధికారులు వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆ మ‌హిళ‌ను అప్ప‌గించారు. పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఆచూకి ల‌భించ‌క‌పోవ‌డంతో ఆక‌లితో చ‌నిపోయి ఉంటుంద‌ని కుటుంబ స‌భ్యులు భావించారు. ఏ ఒక్క‌రూ ఆక‌లితో అల‌మ‌టించ‌రాద‌నే ముఖ్య‌మంత్రి ఆదేశాల‌తో స్పందించిన జిహెచ్‌ఎంసి అధికారులు చూపిన చొర‌వ‌, మాన‌వీయ కోణంతో మ‌హ‌బూబ్‌బి కు పున‌రుజ్జీవం ల‌భించింది. జిహెచ్‌ఎంసిని, అధికారుల కృషిని కుటుంబ స‌భ్యులు, చుట్టుప్ర‌క్క‌ల ప్ర‌జ‌లు అభినందించారు.

- Advertisement -