గ్రేటర్ హైదరాబాద్ లో మెరుగైన రవాణా వ్యవస్థకై రహదారుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలియజేశారు. ఉప్పల్ వరంగల్ మార్గంలో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి 150 ఫీట్ల మేర చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయిన లబ్దిదారులకు జిహెచ్ఎంసి కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ చెక్కుల పంపిణీ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అనలా హనుమంత్ రెడ్డి, డిప్యూటి కమిషనర్ కృష్ణ కిషోర్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ ..గ్రేటర్ హైదరాబాద్ లో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఎస్.ఆర్.డి.పి కార్యక్రమాన్ని చేపట్టామని, దీంతో పాటు నగరంలోని పలు రహదారుల విస్తరణ, ప్రత్యామ్నయ రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నామని తెలియజేశారు. దీనిలో భాగంగా అంబర్ పేట్ అలీ కేఫ్ నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్ మీదుగా ఏషియన్ థియేటర్ వరకు ప్రత్యేక రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 257 ఆస్తులను సేకరించాల్సి ఉండగా కేవలం 84 మినహా మిగిలిన ఆస్తులను అంగీకారం తెలిపారని మేయర్ తెలిపారు.
ఈ మార్గంలో ఏడు మతపరమైన నిర్మాణాలు, ఆరు ప్రభుత్వ నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే సేకరించిన 33 నిర్మాణాలను కూల్చివేశామని పేర్కొన్నారు. ఈ ఆస్తులు, భూ సేకరణకు గాను ఇప్పటికే రూ. 31కోట్లు చెల్లించగా నేడు మరో రూ. 17 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. నగర ఈశాన్యం వైపు ఉన్న ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ది దిశగా దూసుకుపోతుందని అన్నారు. దీనిలో భాగంగా మౌలిక సదుపాయల కల్పన, రోడ్డు విస్తరణకు ప్రత్యేక నిధులను కేటాయించాలని విజ్జప్తి చేశారు. ఈ సందర్భంగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఆస్తులు అందించిన లబ్దిదారులకు మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిలు చెక్కులు పంపిణీ చేశారు.