ఇకపై సాయంత్రం కూడా చెత్త తొలగింపు:జీహెచ్‌ఎంసీ

465
ghmc garbage collection
- Advertisement -

హైద‌రాబాద్ న‌గ‌రంలో సాయంత్రం వేళ‌లోనూ గార్బేజ్‌ను తొల‌గించేందుకు అద‌న‌పు వాహ‌నాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో ప‌లు అంశాల‌పై నేడు జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, హెచ్‌.ఓ.డిల‌తో స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలో పారిశుధ్య కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని, దీనిలో భాగంగా సాయంత్ర‌వేళ‌లోనూ గార్బేజ్ ఎత్తివేత‌కు అద‌న‌పు వాహ‌నాల‌ను ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌లో భాగంగా అద‌న‌పు వాహ‌నాలు ఎంత మేర‌కు అవ‌స‌రం ఉన్నాయనే అంశాన్ని అద్య‌య‌నం చేసి వెంటనే త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

జూన్ 5వ తేదీన నిర్వ‌హించే ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా హ‌రిత‌హారం, ఇంకుడు గుంత‌ల త‌వ్వ‌కం, ప్లాస్టిక్ నిషేదం అనే మూడు ప్ర‌త్యేక అంశాల‌తో ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. న‌గ‌రంలో ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను సేక‌రణ చేయ‌డానికి చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 200 ట‌న్నుల ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డం జ‌రిగింద‌ని, ఈ ప్లాస్టిక్ ఏరివేత కార్య‌క్ర‌మాన్ని నిరంత‌రం చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. హ‌రిత‌హారంను పుర‌స్క‌రించుకొని న‌గ‌రంలోని 150 వార్డుల్లో ప్ర‌తి వార్డులోనూ క‌నీసం రెండు ల‌క్ష‌ల మొక్క‌ల‌ను నాటాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించిన‌ట్టు దాన‌కిషోర్ ప్ర‌క‌టించారు. ఇందుకుగాను ప్ర‌తి వార్డులో రోడ్ల విస్తీర్ణం, ఖాళీ స్థ‌లాలు, ప్ర‌భుత్వ, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ప్రైవేట్ కార్యాల‌యాల వివ‌రాలు, కాల‌నీ సంక్షేమ సంఘాలు, మొక్క‌ల పంపిణీ వివ‌రాల ప్ర‌ణాళికల‌తో కూడిన ప్ర‌త్యేక బుక్‌లెట్‌ల‌ను రూపొందించాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్‌ల‌కు చెందిన అన్నికార్యాల‌యాలు, వాట‌ర్ ట్యాంక్‌ల ప్ర‌దేశాల్లో న‌ర్స‌రీల పెంప‌కాన్ని చేప‌డుతున్న‌ట్టు క‌మిష‌న‌ర్ తెలిపారు. ముఖ్యంగా సాహెబ్ న‌గ‌ర్‌లో ఉన్న మెట్రో బోర్డు కార్యాల‌యంలో దాదాపు 40 ఎక‌రాల‌కు పైగా ఖాళీ స్థ‌లం ఉంద‌ని, ఇదే విధ‌మైన మెట్రో కార్యాల‌యాల ఖాళీ స్థ‌లాల్లో వెంట‌నే న‌ర్స‌రీల పెంపుకు త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. రానున్న వ‌ర్షాకాలం దృష్ట్యా జూన్ మొద‌టి లేదా రెండో వారం నుండి న‌గ‌రంలో సెల్లార్ల త‌వ్వ‌కం పై నిషేదాన్ని విధించే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. న‌గ‌రంలో గుర్తించిన పురాత‌న, శిథిల భవ‌నాల కూల్చివేత‌కు తిరిగి నోటీసులు సంబంధిత య‌జ‌మానుల‌కు జారీచేయాల‌ని పేర్కొన్నారు.

న‌గ‌రంలో ర‌హ‌దారుల‌పై ఉన్న మ్యాన్‌హోళ్ల‌ను రోడ్డుకు స‌మాంత‌రంగా పున‌రునిర్మించేందుకు చేప‌ట్టిన ప‌నుల్లో 6వేల మ్యాన్‌హోళ్ల నిర్మాణం పూర్తైంద‌ని తెలిపారు. ఆస్తిప‌న్ను సేక‌ర‌ణలో భాగంగా రూ. 1200 నుండి ల‌క్ష రూపాయ‌ల‌లోపు ఆస్తిప‌న్ను చెల్లించే భ‌వ‌నాలను రీ-అసెస్‌మెంట్ చేయ‌డానికిగాను ప్ర‌త్యేకంగా యాప్‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. దీంతో పాటు నానో మానిట‌రింగ్ వాహ‌నాల ఏర్పాటుకు టెండ‌ర్ ప్రక్రియ పూర్తి అయిన‌ట్టు చెప్పారు. వివిధ అంశాల‌పై న‌గ‌రవాసుల నుండి అందే ఫిర్యాదుల ప‌రిష్కారానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, ఈ విష‌య‌మై తాను ప్ర‌త్యేకంగా స‌మీక్షించ‌నున్న‌ట్టు తెలిపారు. కాగా జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం నుండి జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో నేరుగా స‌మావేశాలు నిర్వ‌హించేందుకుగాను వీడియో కాన్ఫ్‌రెన్స్ విధానాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా నిర్వ‌హించారు. ఈ సమావేశంలో అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు అమ్ర‌పాలి కాట‌, శృతిఓజా, అద్వైత్‌కుమార్‌సింగ్‌ సందీప్‌జా, సిక్తాప‌ట్నాయ‌క్‌, కెన‌డి, విజిలెన్స్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, చీఫ్ ఇంజ‌నీర్లు సురేష్‌, జియాఉద్దీన్‌, శ్రీ‌ధ‌ర్‌ త‌దిత‌రులు ఈ స‌మావేశానికి హాజ‌రయ్యారు.

- Advertisement -