తెలంగాణ కు హరితహారం అమలుపై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో బుధవారం జోనల్, డిప్యూటీ కమీషనర్లతో జిహెచ్ఎంసి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కార్పొరేటర్లతో చర్చించి వార్డు ప్రణాళిక రూపోందించాలని డిప్యూటీ కమీషనర్లను కోరారు. మొక్కలు, నాటి, సంరక్షించుటలో జిహెచ్ఎంసి లోని 30 వేల మంది ఉద్యోగులను భాగస్వాములను చేయాలని సూచించారు. కాలనీ సంక్షేమ సంఘాలును మొక్కలు నాటుటలో భాగస్వాములను చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షలు మొక్కలు నాటి, సంరక్షించాలి అని కమీషనర్ సూచించారు.
గుంతలు తీయించి, మొక్కలు నాటుటతో పాటు, సంరక్షణకు ప్రతి లొకేషన్‌కు ఒకరిని ఇంచార్జి గా నియమించాలి. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుటకు ఫెన్సింగ్, నీరు పోయుట, కలుపుతీత పనులను పరిశీ లించాల్సిన బాధ్యత ఇంచార్జి అధికారిదే. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద జిహెచ్ఎంసి పరిధిలో అన్ని రోడ్లు కలిపి 9300 కిలోమీటర్లు వుంటాయని, అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు కనిపించాలన్నారు కమీషనర్. రోడ్డు పక్కన స్థలం తక్కువగా ఉంటే సంబంధిత ఇంటి యజమానితో మాట్లాడి, ప్రహరీ గోడకు లోపల మొక్కలు నాటించాలి. ప్రధాన రోడ్లు 709 కిలోమీటర్లులో రోడ్లకిరువైపులాతో పాటు మీడియన్స్‌లో ఎవెన్యూ ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్ఠి సారించాలి.
అయితే మెట్రో రైలు మార్గంలో హెచ్ఎంఆర్ఎల్ వారు హరితహారంను చేపడతారని తెలిపారు. స్మశానవాటికల ప్రహరీ గోడలు గ్రీన్ కర్టెన్స్ ను తలపించేలా ప్రత్యేక మొక్కలు నాటాలి. లే అవుట్ ఖాళీ ప్రదేశాలు,ఇతర ఖాళీ ప్రదేశాలలో యాదాద్రి ఫారెస్ట్ మోడల్‌లో ప్లాంటేషన్ చేయాలి. యాదాద్రి మోడల్‌లో హెక్టారు భూమిలో వరుసలలో వివిధ ఎత్తులలో వున్న 40 వేల మొక్కలను నాటవచ్చు.లే అవుట్ లలో బయో ఫెన్సింగ్‌కు ప్రాదాన్యత ఇవ్వాలి. నాలా లకు ఇరువైపుల మొక్కలు నాటాలి. అవకాశం లేనట్లైతే, నాలా పక్కనున్న ఇంటి యజమానితో మాట్లాడి మొక్కలు నాటించాలని కమీషనర్ అధికారులను ఆదేశించారు.
మూసీకి రెండు పక్కల వెదురు లాంటి రకాల మొక్కలు నాటాలి. చెరువు కట్టలకు ఇరువైపులతో పాటు, నీరు నిలవని ప్రాంతాల్లో మొక్కలు నాటాలని కమీషనర్ సూచించారు.ఈ సమావేశంలో బయో డైవర్సిటీ అదనపు కమీషనర్ కృష్ణ, సి సి పి దేవేందర్ రెడ్డి, జోనల్ కమీషనర్లు వి. మమత, ఎన్ రవికిరణ్, బి శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అశోక్ సామ్రాట్ పాల్గొన్నారు.