రాజ‌కీయ పార్టీల‌తో జిహెచ్ఎంసి కమిషనర్ స‌మావేశం..

318
Lokesh kumar ias
- Advertisement -

రాజకీయ పార్టీలతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ ఎంసి కమీషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ బుధ‌వారం జిహెచ్ఎంసి ప్ర‌ధాన‌ కార్యాల‌యంలో సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో రాజ‌కీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని విజ్ఞ‌ప్తి చేశారు. డబీర్ పుర డివిజన్ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. డ‌బీర్‌పుర‌లో 49,445 మంది ఓట‌ర్లు ఉంటార‌ని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 లోపు ఓటర్లు ఉంటార‌ని తెలిపారు. బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ జ‌రుగుతుంద‌ని తెలిపారు. డ‌బీర్‌పుర వార్డు ఎన్నిక‌ల‌కు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5గంట‌ల‌లోపు నిర్ణీత ప్రొఫ‌ర్మాలో నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌వ‌చ్చున‌ని తెలిపారు.

స‌ర్దార్‌మ‌హాల్‌, మ‌ల‌క్‌పేట స‌ర్కిల్‌-6లో ఉన్న డిప్యూటి క‌మిష‌న‌ర్ ఛాంబ‌ర్‌లో నామినేష‌న్లు స్వీక‌రిస్తార‌ని తెలిపారు. డ‌బీర్‌పుర వార్డు ఎన్నిక‌ల‌కు హైద‌రాబాద్ అర్బ‌న్ ల్యాండ్ సీలింగ్ స్పెష‌ల్ డిప్యూటి క‌లెక్ట‌ర్‌ అనిల్ కుమార్ రిట‌ర్నింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఈనెల 11వ తేదీ ఉద‌యం 11గంట‌ల నుండి నామినేష‌న్ ప‌త్రాల స్క్రూటిని జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ 12వ తేదీ సాయంత్రం 3గంట‌ల‌లోపు నామినేస‌న్ల స్వీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఈనెల 22న ఉద‌యం 7గంట‌ల నుండి సాయంత్రం 5గంట‌ల‌కు పోలింగ్ జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.

ఓట‌రు జాబితా ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ‌లో భాగంగా 2019 డిసెంబ‌ర్ 16న ప్ర‌చురించిన ముసాయిదా ఓట‌రు జాబితాపై ఈ నెల 15 వ‌ర‌కు క్లైమ్‌లు, అభ్యంత‌రాలు చేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ తెలిపారు. డిసెంబ‌ర్ 16 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 30,040 అభ్యంత‌రాలు, క్లైమ్‌లు అందిన‌ట్లు తెలిపారు. వాటిలో 4,140 ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించి 2,691 ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించిన‌ట్లు తెలిపారు. ఈ నెల 15 వ‌ర‌కు మ‌రో 20వేల క్లైమ్‌లు, అభ్యంత‌రాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. వీట‌న్నింటిని ఈ నెల 27లోపు ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే జిల్లాలో ఉన్న 15 శాస‌న స‌భ స్థానాల ఎల‌క్టోర‌ల్ రిజిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్లు ముసాయిదా ఓట‌రు జాబితాను ప‌రిశీలించి 16,916 ఓట‌ర్ల ఇంటినెంబ‌ర్లు త‌ప్పుగా న‌మోదు అయిన‌ట్లు గుర్తించార‌ని తెలిపారు.

ఇత‌ర పోలింగ్ కేంద్రాల‌కు సంబంధించిన ఓట‌ర్లు 99,688 మంది ముసాయిదా పోలింగ్ కేంద్రాల‌లో న‌మోదు అయిన‌ట్లు తెలిపారు. ప్ర‌ధానంగా పోలింగ్ కేంద్రాల ప్రారంభ‌, ముగింపు ఓట‌రు క్ర‌మ సంఖ్య‌ల‌లో ఈ విధంగా న‌మోదు అయిన‌ట్లు వివ‌రించారు. 4,646 మంది ఓట‌ర్లు ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందినవారు ఉన్నార‌ని తెలిపారు. 10,983 మంది ఓట‌ర్ల ఫోటోలు క్లీయ‌ర్‌గా ప్రింట్ కాలేద‌ని తెలిపారు. ఓట‌రు జాబితా ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ‌పై రాజ‌కీయ పార్టీలు సూచించిన అంశాల‌ను చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ దృష్టికి తెచ్చిన‌ట్లు తెలిపారు. ముసాయిదా ఓట‌రు జాబితాను స‌మ‌గ్రంగా ప‌రిశీలించి, త‌ప్పుల‌ను గుర్తించుట‌లో బూత్‌లేవ‌ల్ ఏజెంట్ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని సూచించారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల పిటిషన్లు ఉన్న 5 స్థానాల మినహా మిగిలిన‌ అసెంబ్లీ స్థానాలు మ‌రియు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో మాక్ పోలింగ్‌, వాస్త‌వ పోలింగ్‌లో వినియోగించిన వివిపాట్ ప్రింటెడ్ స్లిప్స్ డిస్పోజ్ చేయ‌నున్న‌ట్లు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ తెలిపారు. ఎన్నిక‌ల పిటీష‌న్లు న‌మోదు అయిన 60-ఖైర‌తాబాద్‌, 61-జూబ్లీహిల్స్, 63-నాంప‌ల్లి, 65-గోషామ‌హ‌ల్‌, 70- సికింద్రాబాద్ శాస‌న స‌భ స్థానాల ఎన్నిక‌ల‌పై ఎన్నిక‌ల పిటీష‌న్లు న‌మోదైన‌ట్లు తెలిపారు. ఈ నెల 11,12,13 తేదీల‌లో వివిప్యాట్ ప్రింటెడ్ స్లిప్స్ డిస్పోస‌ల్‌కు నిర్వ‌హించే ప్ర‌క్రియ‌లో రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు త‌ప్ప‌నిస‌రిగా పాల్గొనాల‌ని కోరారు. అందుకు సంబంధించిన షెడ్యూల్డ్‌ను రాజ‌కీయ పార్టీల‌కు అంద‌జేయనున్న‌ట్లు తెలిపారు. వార్డు నెంబ‌ర్ 14లోని చుడీ బ‌జార్‌లో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం, వివి ప్యాట్ గోడౌన్‌లో ఈ ప‌క్రియ జ‌రుగుతుంద‌ని తెలిపారు.

జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల్లో చురుగ్గా పాల్గొనాల‌ని రాజ‌కీయ పార్టీల‌కు క‌మిష‌న‌ర్‌ లోకేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 18న అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారిగా వివిధ పోటీల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 21న జిల్లా స్థాయి వేడుక‌లు, 24న చాద‌ర్‌ఘాట్‌లోని విక్ట‌రీ ప్లే గ్రౌండ్‌లో ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ నెల 25న ప్ర‌తి పోలింగ్ కేంద్రంలో, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిల‌తో పాటు రాష్ట్ర స్థాయి జాతీయ ఓట‌రు దినోత్స‌వ వేడుక‌లు జ‌రుగుతాయ‌ని తెలిపారు. 25న ర‌వీంద్ర భార‌తిలో చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర స్థాయి వేడుక‌లు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో టి.ఆర్‌.ఎస్ నుండి పి.పురుషోత్తంరావు, కె.వినోద్‌, కాంగ్రెస్ నుండి మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి, జి.నిరంజ‌న్‌, బిజేపి నుండి కె.ప‌వ‌న్‌, వి.ఎస్‌.భ‌ర‌త్వాజ్‌, ఎం.ఐ.ఎం నుండి ఎస్‌.ఏ హ‌స‌న్ జాఫ్రీ, ఎస్‌.డి అహ్మ‌ద్‌, బి.ఎస్‌.పి నుండి కొమ్ము అగ్రిప్ప‌, బాల‌రాజు, సి.పి.ఎం నుండి ఎం.శ్రీనివాస‌రావు, సిపిఐ స‌య్య‌ద్ అబ్దుల్ మ‌న్న‌న్‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఎల‌క్టోర‌ల్ రిజిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్లు, ఏ.ఇ. ఆర్‌.ఓలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -