10రోజుల్లో 600మెడికల్ క్యాంపులుః దాన కిషోర్

446
dana kishore
- Advertisement -

  నగరంలో అంటు వ్యాధుల నివారణ, చైతన్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ లో 600 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్ట జీహెచ్ఎంసి కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. నగరంలో సీజనల్ వ్యాధులు, వాటి నివారణకు చేపట్టిన చర్యలపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్య శాఖ అధికారులు, మలేరియా అధికారులు, ఎంటమాలజి అధికారులతో కమిషనర్ దానకిషోర్ నేడు సాయంత్రం సమిక్ష సమావేశాన్ని నిర్వహించారు.

జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు సిక్తాపట్నాయక్, సందీప్ జా, చీఫ్ ఎంటమాలజి అధికారులు వెంకటేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు. ఈసందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారాన్ని డ్రై డే గా పాటించడం ద్వారా పాత్రలలో నీటి నిల్వలు ఉండకుండా తొలగించడం, ఇంటి పై ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ లపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు అమర్చడం, పనికిరాని సీసాలు, డబ్బాలు, రబ్బర్ టైర్లు వాటర్ కూలర్లు తదితర పాత్రలలో నీరు నిల్వకుండా తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఇందుకుగాను జిహెచ్ఎంసి ఎంటమాలజి విభాగానికి చెందిన 650 బృందాలు పాల్గొంటున్నాయని తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పది రోజుల్లో 600 ప్రత్యేక మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే నగరంలో దాదాపు 400 మెడికల్ క్యాంపులను నిర్వహించామని పేర్కొన్నారు. ప్రతి బుధవారం జరిగే స్వయం సహాయక బృందాల సమావేశంలో ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణ, ఫ్రై డే డ్రై డేగా పాటింపు, బస్తి దవాఖానాల గురించి ప్రత్యేకంగా చైతన్యాన్ని కలుగజేయాలని కమిషనర్ ఆదేశించారు.

 సాధారణ జ్వరంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వారికి సరైన నిర్థారణ పరీక్షలు నిర్వహించకుండానే డెంగ్యు వ్యాధి సోకిందని భయబ్రాంతులకు గురిచేస్తూ చికిత్సలు అందిస్తూ లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నారని పలు ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు.గ్రేటర్ లోని మూడు జిల్లాల జిల్లా వైద్య శాఖ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరిపే డెంగ్యు జ్వరాలకు సంబంధించి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో దోమల వ్యాప్తి వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు జీహెచ్ఎంసి ప్రవేశపెట్టిన మస్కిటో యాప్ ను 8లక్షల మందికిపైగా డౌన్ లోడ్ చేసుకున్నారని, ఈ మస్కిటో యాప్ లో ఉన్న 17 ప్రశ్నలకు సరైన సమాధానాలు అందించేవారిని లాటరీ ద్వారా 10 మందిని గుర్తించి ఒకొక్కరికి 10వేల రూపాయల చొప్పున పది మందికి అందజేయనున్నట్టు దానకిషోర్ ప్రకటించారు. ఈ మస్కిటో యాప్ ను మై జిహెచ్ఎంసి యాప్ లో పొందుపర్చడం జరిగిందని పేర్కొన్నారు.

- Advertisement -