మూడు రోజుల పాటు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ప్రపంచ పారిశ్రామివేత్తల సదస్సు ముగిసింది. ప్రధాని మోడీ, అమెరికా సలహాదారు ఇవాంక, దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, అతిరథ మహారథులు పాల్గొన్న సద స్సు మూడ్రోజులపాటు కన్నుల పండువగా జరిగింది. జీఈఎస్ ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్… ఈ సదస్సుతో హైదరాబాద్ ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లను ఒక తాటిపైకి తీసుకు వచ్చే ఉద్దేశంతో జీఈఎస్ ఏర్పాటుకాగా తొలిసారిగా దక్షిణాసియాలో హైదరాబాద్ వేదికగా ఈ సదస్సు జరిగింది. జీఈఎస్ నేపథ్యంలో ఎవరినోట విన్నా తెలంగాణ మాట.. ఎవరిని కదిలించినా హైదరాబాద్ పాట. ఇవాంకాట్రంప్ నుంచి వివిధ దేశాల నుంచి తరలివచ్చిన ప్రతినిధుల వరకూ హైదరాబాద్ ఆతిథ్యానికి ఫిదా కానివాళ్లు లేరు.
సదస్సు మొదటి రోజు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్రం విందు ఏర్పాటు చేయగా, రెండోరోజు తెలంగాణ రుచులతో గోల్కొండ కోటలో రాష్ట్ర సర్కారు విందు ఇచ్చింది.మూడోరోజు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో వివిధ దేశాలకు చెందిన వంటకాలు, వెరైటీ రుచులు అతిథుల నోరూరించాయి.
జీఈఎస్‌ను దిగ్విజయంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వంపై అమెరికా ప్రశంసలు కురిపించింది. జీఈఎస్ సదస్సు ద్వారా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయని అమెరికా అభిప్రాయపడింది. అంతేకాదు.. సదస్సును నిర్వహించిన తీరుకు ముచ్చటపడిన ఇవాంక.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌ను అమెరికాకు రావాలంటూ స్వయంగా ఆహ్వానించడం ఆయన ప్రతిభకూ, రాష్ట్ర ప్రభుత్వ సమర్థతకూ లభించిన కితాబు. మొత్తంగా మూడు రోజుల పాటు జరిగిన సదస్సులో ఇవాంక,మంత్రి కేటీఆర్ హైలెట్‌గా నిలిచారు.
వాస్తవానికి ఏ పరిశ్రమకైనా పెట్టుబడులే కీలకం. ఈ సదస్సులో టీవీఎస్ క్యాపిటల్, వెంచర్ ఈస్ట్, కలారి క్యాపిటల్, కార్లైల్ ఇండియా అడ్వయిజర్స్, లెట్స్ వెంచర్, ఐవీక్యాప్ వెంచర్స్, విలేజ్ క్యాపిటల్, ఎండియా పార్ట్‌నర్స్, స్పార్క్‌రైజ్.. ఇలా పెద్ద సంఖ్యలో ఇన్వెస్ట్‌మెంట్, క్రౌడ్ ఫండింగ్ కంపెనీలు పాల్గొన్నాయి.
కొత్త ఆలోచనలతో సంస్థలు ప్రారంభించి, తగిన మార్గదర్శకత్వం కోసం, అవసరమైన నిధుల కోసం చూస్తున్న స్టార్టప్‌లకు ఇది చక్కటివేదికగా ఉపయోగపడింది. ఇటు ఔత్సాహికులు.. అటు బ్యాంకర్లు.. వెంచర్ క్యాపిటలిస్టులు.. ప్రత్యేకించి మహిళా పారిశ్రామికవేత్తలు అందరికీ హైదరాబాద్ భవిష్యత్ డెస్టినేషన్‌గా కనిపించింది. ఏ దేశమైనా ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే.. హైదరాబాద్ గురించి తప్పనిసరిగా ఆలోచించేలా పరిస్థితులను మార్చేసింది.
53 అంశాలపై 98 మంది ప్రముఖులు జరిపిన విస్తృతమైన చర్చలు జీఈఎస్‌ను ఊహించినదానికన్నా విజయవంతం చేశాయి. అసాధారణ రీతిలో భద్రతాఏర్పాట్లు, అబ్బురపరిచే ఆతిథ్య సేవలు.. అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు.. టీహబ్ వంటి ఆకర్షించే అవకాశాలు.. స్టార్టప్‌ల సంరంభం.. రాజధాని హైదరాబాద్‌కు మునుపెన్నడూ లేనివిధంగా గ్లోబల్ బ్రాండ్‌ను తెచ్చిపెట్టాయి.విదేశీ ప్రతినిధులు ఎంతో సంతృప్తితో.. హైదరాబాద్‌ను, ఇక్కడి బిర్యానీని, తెలంగాణ ఆతిథ్యాన్ని జ్ఞాపకాలుగా నింపుకొని తిరుగుపయనమయ్యారు.