అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పందేలు, ఎన్నో అంచనాలు, మరెన్నో సర్వేలు వెలువడ్డాయి. ఎప్పుడూ లేనంత ఆసక్తిగా, పోటాపోటీగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారని ప్రపంచం మొత్తం ఎదురుచూసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అమెరికన్లకు సంబంధించి ఇదో షాకింగ్ వార్త. కొందరు ట్రంపు మాకు అధ్యక్షుడు కాడంటూ తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేశారు. అయితే అమెరికాలోని ఓ వ్యక్తి మాత్రం తన దేశ తదుపరి అధ్యక్షుడెవరో చెప్పొద్దంటూ ప్లకార్డు మెడకు తగిలించుకుని తిరుగుతున్నాడు.
నవంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడెవరంటూ చర్చలు జరుగుతుండగా అమెరికాలోని జార్జియాకు చెందిన జో చాండ్లర్ మాత్రం తదుపరి రోజు ఉదయం తెలుసుకోవచ్చని హాయిగా పడుకున్నాడు. తర్వాతి రోజు కూడా ఎవరు గెలిచారో తెలుసుకోకుండా సాయంత్రం వరకు వేచి చూద్దాం అని నిర్ణయించుకున్నాడు. ఇలా ఎవరు గెలిచారో తెలుసుకోకుండా ఇలా వాయిదా వేయడం చాండ్లర్‌కు బాగా నచ్చింది. ఇంటర్నెట్, టీవీ, పేపర్ చూస్తే విషయం తెలిసిపోతుందని అవి చూడటం కూడా పూర్తిగా మానేశాడు. పైగా ఎవరూ తనకు విజేత ఎవరన్న విషయం చెప్పకూడదని.. చెప్పినా వినకూడదని హెడ్‌ఫోన్స్ పెట్టుకుని తిరుగుతున్నాడు.
వీలైనంత వరకు అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలిచారన్న విషయాన్ని తెలుసుకోకూడదని ‘‘అధ్యక్షుడిగా ఎవరు గెలిచారో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. నాకు ఈ విషయం గురించి ఎవరూ చెప్పొద్దు’’ అని రాసి ఉన్న ప్లకార్డును మెడలో వేసుకుని తిరుగుతున్నాడు. ఇక అతని స్నేహితులు, బంధువులు ఎన్నికలకు సంబంధించిన విషయాలు అతని దగ్గర ప్రస్తావించడం పూర్తిగా మానేశారు. మరీ ఇలా ఎంత కాలం అధ్యక్షుడెవరో తెలుసుకోకుండా ఉంటాడో చూడాలి…