గీతాంజలి మళ్లీ వచ్చింది..రిలీజ్ డేట్ ఫిక్స్

30
- Advertisement -

అందాల నటి అంజలి ‘గీతాంజలి’ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం “గీతాంజలి మళ్లీ వచ్చింది” చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. అంజలికి ఇది 50వ చిత్రం.దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా మారింది.

గీతాంజలికి సీక్వెల్‌గా రాబోతోన్న ఈ మూవీ కూడా అదే హారర్-కామెడీ జానర్‌లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హారర్‌ కామెడీ జానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఈ హారర్ థ్రిల్లర్ పై అంచనాలను పెంచింది.

నిజానికి ఈ చిత్రాన్ని పలు భాషల్లో మార్చి 22న విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ తేదీకి చాలా చిత్రాలు వస్తున్నాయి. అన్ని సినిమాలకు తగిన ప్రాధాన్యం లభించాలనే ఉద్దేశంతో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ వాయిదా వేశారు. ఈ మేరకు మేకర్లు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. “గీతాంజలి మళ్లీ వచ్చింది” సినిమాను ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సీక్వెల్ హారర్-కామెడీ జోనర్‌లోని అన్ని చిత్రాలను అధిగమిస్తుందని, రికార్డుల్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని టీమ్ నమ్మకంగా ఉంది.

‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి సీక్వెల్ ప్రారంభం కానుంది. ఈ సీక్వెల్‌లో అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు, ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు మేకర్లు ఎంతో కష్టపడుతున్నారు. హాస్యం, భయానకం, ఆకట్టుకునే కథనాన్ని మిళితం చేసి అసమానమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.

యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ సినిమా ద్వారా తనదైన ముద్ర వేస్తోంది. నిన్ను కోరి, నిశ్శబ్దం చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అట్లాంటా (యుఎస్)కి చెందిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా.. సుజాత సిద్దార్థ్ కెమెరామెన్‌గా పని చేశారు. కోన వెంకట్ కథ రాశారు. ఈ చిత్రాన్ని ఎంవివి సత్యనారాయణ, జీవీ నిర్మించారు.

Also Read:గోంగూర ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -