రివ్యూ : గౌతమి పుత్ర శాతకర్ణి..

258
Gautamiputra Satakarni Movie Review
- Advertisement -

తెలుగుజాతి గ‌ర్వించ‌ద‌గ్గ నాటి త‌రం న‌టుడు, న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క రామారావు వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో నంద‌మూరి బాల‌కృష్ణ. టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకడిగా నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై మెరుపులు మెరిపించిన బాలయ్య 99 సినిమాలు పూర్తి చేసుకుని 100వ సినిమా గౌతమి పుత్రశాతకర్ణితో నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గ‌మ్యం – వేదం – కృష్ణంవందే జ‌గ‌ద్గురుం – కంచె సినిమాల‌తో విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ డిఫ‌రెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారిక‌ల్ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మరి సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య… వందో సినిమాతో ఆకట్టుకున్నాడా లేదా.. ?శాతకర్ణితో మెప్పించాడా లేదా చూద్దాం ..

కథ:

శాతవాహన రాజుల్లో గొప్ప రాజు..భారత ఉపఖండాన్ని పాలించిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. ఎంతోమంది భరత ఖండాన్ని పాలించిన…వారందరిలో శాతవాహన రాజు శాతకర్ణి ప్రత్యేక వ్యక్తి. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధానిగా ఉన్న అమ‌రావ‌తి (గుంటూరు జిల్లాలో ఉన్న ప్ర‌ముఖ పంచారామ క్షేత్రం) ని రాజ‌ధానిగా చేసుకుని పాలించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు త‌న సామ్రాజ్య విస్త‌ర‌ణ‌తో పాటు పొరుగు రాజ్యాల నుంచి సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో భీక‌ర‌మైన యుద్ధాలు చేస్తాడు. ఈ క్రమంలోనే గ్రీకుల దండ‌యాత్ర జ‌రుగుతుంది. అఖండభారతాన్ని చేజిక్కుంచుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. మరి డెమిత్రయస్‌ని శాతకర్ణి ఎలా ఓడించాడు? తాను కలలుగన్న అఖండభారతావనని ఎలా సృష్టించాడు?ఇటు స్వ‌దేశంలో శాత‌క‌ర్ణి వ్య‌తిరేక‌త శ‌క్తుల‌ను, అటు గ్రీకుల దండ‌యాత్ర‌ను శాత‌క‌ర్ణి ఎలా తిప్పికొట్టి అన్న‌దే సినిమా స్టోరీ.

Gautamiputra Satakarni Movie Review

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నందమూరి బాలకృష్ణ, కథ,కథనం, క్రిష్ దర్శకత్వం. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిగా బాల‌య్య విశ్వ‌రూప‌మే చూపించాడు. బాల‌య్య డైలాగుల‌తోను, వార్ స‌న్నివేశాల్లోను న‌ట సింహం అనిపించాడు. వ‌శిష్ట దేవిగా శ్రియ సైతం అద్భుతంగా చేసింద‌ని ట్రైల‌రే చెపుతోంది. ఇక శాత‌క‌ర్ణి త‌ల్లి గౌత‌మిగా బాలీవుడ్ డ్రీమ్ గ‌ర్ల్ హేమ‌మాలిని పాత్ర హిస్ట‌రీలో నిలిచిపోయేలా ఉంది. ‌యుద్ధ సన్నివేశాలకు దీటుగా ఒకొక్క మాట ఓ తూటాలా పేలింది. ఓ చారిత్రాత్మక కథకి బలమైన మాస్‌ అంశాలను జోడించి చెప్పిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్‌:

కథను డామినేట్ చేసే విధంగా యుద్ధ సన్నివేశాలు ఉండటం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో పాటు కొన్ని చోట్ల క్వాలిటీ త‌గ్గిన విజువ‌ల్స్‌…. శాత‌క‌ర్ణిని కేవ‌లం యుద్ధ‌కోణంలో చూపించ‌డం సినిమాకు మైనస్ పాయింట్స్.

సాంకేతిక విభాగం:

ముందుగా చెప్పుకోవాల్సి దర్శకుడు క్రిష్ గురించే.సాంకేతికంగా ఈ సినిమాకు వందకు వంద మార్కులు వేయాల్సిందే. దర్శకుడు పనితనం అడుగడుగునా కన్పిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనం శాతవాహనుల కాలంలో ఉన్నామేమో అన్న ఫీలింగ్ కనిపిస్తుంది. అంతలా భావోద్వేగం చెందేలా క్రిష్ సన్నివేశాలను తీర్చిదిద్దారు. తెలుగు సినిమా టేకింగ్‌ను మరో మెట్టు ఎక్కించే దర్శకుల జాబితాలో క్రిష్ మరోసారి చోటు సంపాదించాడు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ, రామ్‌-ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్‌, చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌, భూపేష్ భూప‌తి ఆర్ట్‌, సిరివెన్నెల సాహిత్యం, బుర్రా సాయిమాధ‌వ్ ప‌దునైన డైలాగ్స్ సినిమాకు వన్నె తెచ్చాయి. రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మాణ విలువ‌లు హైలైట్.

Gautamiputra Satakarni Movie Review

తీర్పు:

నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి…అభిమానులకు నిజమైన సంక్రాంతినిచ్చింది. శాతకర్ణిగా బసవతారక పుత్ర బాలయ్య మరోసారి విశ్వరూపం చూపించాడు. తన కోసమే ఆ కథ పుట్టిందన్న చందంగా… వేరేవరు చేయలేరేమో అనిపించేలా బాలయ్య పాత్రకు ప్రాణం పోశాడు. బాలకృష్ణకు తగ్గట్టుగా శ్రియ,హేమమాలని సినిమాను మరో స్ధాయికి తీసుకుపోయారు. విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు క్రిష్‌. మొత్తంగా బాలయ్య చెప్పినట్లు దేశం మీసం తిప్పే సంక్రాంతి మరో బ్లాక్ బస్టర్ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.

విడుదల తేదీ:12/01/2017
రేటింగ్: 3.5 / 5
నటీనటులు:బాలకృష్ణ,శ్రేయ
సంగీతం : చిరంతన్‌ భట్‌
నిర్మాత : వై. రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, సుహాసిని పంగులురి
దర్శకుడు : క్రిష్‌

- Advertisement -