అఖండ భారత దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి పాత్రలో నటించడం గర్వంగా ఉందని ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌ను కరీంనగర్‌లోని తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. శాతకర్ణి సినీ చరిత్రలో అద్భుతమవుతుందన్నారు.
గౌతమి పుట్టిన వూరు కోటిలింగాలకు వెళ్లినట్టు చెప్పారు. ప్రపంచపటంలో మనదేశానికి గౌరవాన్ని తెచ్చిన ఓ వీరబిడ్డ శాతకర్ణి చరిత్రే ఈ చిత్రమని వివరించారు. ఎన్టీఆర్ వారసుడిగా ఈ కథను చాటిచెప్పడం తన ధర్మంగా భావిస్తున్నానని తెలిపారు. 100వ చిత్రంగా ఏం సినిమా చేయాలా అని సతమతమవుతున్న సమయంలో క్రిష్ వచ్చారని.. కథ విన్పిస్తే తాను వెంటనే అంగీకరించానని చెప్పారు. ఇదంతా యాధృచ్ఛికంగానే జరిగిపోయిందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ చేసిన సంస్కరణలు చిరస్మరణీయమన్నారు. ఆయన పేదలకు ఎంతో సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమం అనిర్వచనీయమైన అనుభూతినిచ్చిందన్నారు. తమ షూటింగ్‌కు ప్రకృతి కూడా బాగా సహకరించిందని చెప్పారు.
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి మాటల రచయిత సాయిమాధవ్ అద్భుతంగా డైలాగులు రాశారని, ఆయన ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారని, సాయిమాధవ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నానని బాలయ్య అన్నారు. తాను ఎన్నో సినిమాలు చేశానని, పౌరాణిక, జానపద, సాంఘిక, సందేశాత్మక సినిమాలు చేశానని, తన వందో చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా లభించడం ఆనందంగా ఉందని బాలయ్య అన్నారు. సినిమా షూటింగ్‌కి ప్రకృతి సైతం సహకరించిందని, దేశంలో ఎన్నో చోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ తాము షూటింగ్ జరుపుతున్న ప్రాంతంలో మాత్రం వర్షాలు పడలేదని, ఆ విధంగా ప్రకృతి తమకు సహకారం అందించిందని అన్నారు.
మనది ఓ బ్రహ్మాండ్‌మైన చరిత్ర అని బాలకృష్ణ అన్నారు. తెలుగువాడి పౌరుషాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి చాటిచెప్పారని ఆయన అన్నారు. నందమూరి వారసుడిగా ఈ కథను చాటి చెప్పడం తన ధర్మంగా భావించానని బాలయ్య అన్నారు. తన వందో సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించామని, దర్శకుడు క్రిష్ అద్భుతంగా పనిచేశాడని అన్నారు.
ముఫ్పైవేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ పాట కోసం ఒక సాంగ్ ను ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారట. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. ముంబయి నుంచి హైదరాబాద్ కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ పవర్ ఫుల్ సాంగ్ ను ఆయన రాశారని అన్నారు.