తొలి అడుగులోనే ఆకట్టుకొన్న దర్శకుడు సంపత్ నంది. ‘ఏమైంది ఈ వేళ’తో హిట్ అందుకున్న సంపత్ తర్వాత బెంగల్ టైగర్‌తో రచ్చ చేసి మాస్ దర్శకుడిగా తనదైన ముద్రవేశాడు. తాజాగా మాస్ గోపిచంద్ హీరోగా గౌతమ్ నంద అనే సినిమాను తెరకెక్కించాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్…ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సంపత్‌పై గోపీచంద్ పెట్టుకొన్న అంచనాలు నిజమయ్యాయా? సంపత్ కమర్షియల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడా లేదా చూద్దాం….
కథ:
ప్రపంచంలోని టాప్ బిలీనియర్లలో ఒకరైన కృష్ణ మూర్తి కొడుకు గౌతమ్ (గోపీచంద్). అతనికి డబ్బు తప్ప ఏ ఎమోషన్స్ తెలియవు. అయితే ఓ సంఘటన అతని జీవితాన్ని మార్చేస్తుంది. అసలు తానెవరు, తనకంటూ ఉండే ఐడెంటిటీ ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంలో నందు (గోపీచంద్) ను కలుసుకుంటాడు. అలా రెండు విభిన్న నైపథ్యాలు కలిగిన గౌతమ్, నందులు ఒక ఒప్పందం మీద ఒకరి స్థానాల్లోకి మరొకరు వెళతారు. అలా గుర్తింపు మార్చుకున్న ఆ ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ? వాళ్ళ కొత్త పరిస్థితులు వాళ్ళను ఏ విధంగా మార్చాయి ? చివరి వారి జీవితాలు ఎలాంటి గమ్యం చేరాయి ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ గోపిచంద్ స్టైలీష్ లుక్,డైలాగ్‌లు,యాక్షన్ ఎపిసోడ్స్. గోపీచంద్ ఇప్పటివరకూ వచ్చిన అతని ఏ సినిమాలోనూ కనిపించనంత అందంగా కనిపించాడు. స్టైలీష్ లుక్‌లో మరింత నచ్చుతాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో గోపిచంద్ నటన సూపర్బ్. హన్సిక లవ్ ట్రాక్ తో పర్వాలేదనిపిస్తుంది. బిత్తిరి సత్తి కొన్ని నవ్వుల్ని పంచాడు. భరణి.. చంద్ర మోహన్‌తో ఇలా అందరూ సీనియర్లే కావటంతో ఎవరి పాత్రకు వాళ్లు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ రోటిన్ కథ, లాజిక్కులు లేకపోవడం. హీరోయిన్స్ పాత్రలకు కాస్త ప్రాధాన్యం ఇస్తే బాగుండేది. వాన పాట మోతాదు మించినట్లుగా ఉంటుంది. సెకండాఫ్ ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకు కథనం నిరుత్సాహంగా సాగింది. చాలా సన్నివేశాలను కథనంలోకి బలవంతంగా ఇరికించినట్టు తోచింది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. నిర్మాతలు పెట్టిన ఖర్చు అడుగడుగునా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంకాక్ ఎపిసోడ్లు ఆకట్టుకొంటాయి. సౌందర రాజన్ కెమెరా పనితీరు నచ్చుతుంది. సినిమాని బాగా లావీష్‌గా చూపించింది కెమెరా. తమన్ బాణీలు మాస్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినవే. దర్శకుడు చెప్పదలచుకొన్న పాయింట్ బాగుంది. మాస్‌కి నచ్చే అంశాలు ఉండడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
తీర్పు:
ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లడం అనేది పాత కాన్సెప్టే. అయితే దాని చుట్టూ దర్శకుడు అల్లుకొన్న సన్నివేశాలు.. ముడివేసుకొన్న భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి. ఫస్టాఫ్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, బాగుందనిపించే క్లైమాక్స్, గోపీచంద్ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా అనవసరమైన, బోరింగ్ సన్నివేశాలు,రోటిన్ కథ సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా గోపీచంద్‌కు సరికొత్త ఇమేజ్‌ఇచ్చే మూవీ.. ‘గౌతమ్ నంద’ .
విడుదల తేదీ:28/07/2017
రేటింగ్:3/5
నటీనటులు: గోపీచంద్,హన్సిక,కేథరిన్
సంగీతం: తమన్
నిర్మాతలు: జె.భగవాన్, పుల్లారావు
కథ.. మాటలు.. స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: సంపత్ నంది