భోగాపురం..వైసీపీ చెప్పేవన్నీ అబద్దాలే!

4
- Advertisement -

భోగాపురం విమానాశ్రయ అంశంపై వైసీపీ కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. భోగాపురం ప్రాజెక్టు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆనాడు భూసేకరణ జరగకుండా అడ్డుపడింది వైసీపీ నేతలేనని స్పష్టం చేశారు. రైతులను రెచ్చగొట్టి కేసులు పెట్టించి, విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేయడానికి ఆ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం నిజాయితీగా, చిత్తశుద్ధితో పని చేసింది టీడీపీ ప్రభుత్వమేనని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కీలకమైన అభివృద్ధి పనులను అడ్డుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఎయిర్‌పోర్టుకు అవసరమైన కనెక్టివిటీ రోడ్లను ప్రభుత్వం వేగంగా అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు. విశాఖ బీచ్ రోడ్డు నుంచి భోగాపురం వరకు విస్తృతంగా రోడ్డు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ రహదారుల వల్ల ప్రయాణ సౌకర్యం మెరుగుపడి, పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు.

అలాగే విశాఖ నగరానికి సంబంధించి మరో కీలక ప్రాజెక్టు అయిన విశాఖ మెట్రో పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతుందని, ప్రజలు వాస్తవాలను గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read:అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య

- Advertisement -