కరోనా వైరస్…ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారత్‌లో కూడా కరోనా వైరస్ కొంతమందికి సోకడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతుండగా ఈ వార్తలపై స్పందించారు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ.
కరోనా వైరస్‌పై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మార్చి 29 నుంచే ఐపీఎల్ మ్యాచ్‌ల్ని నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు గంగూలీ. టోర్నీలో ఆడేందుకు వచ్చే క్రికెటర్లకి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడంతో పాటు.. కొన్ని జాగ్రత్తలూ సూచిస్తామని వెల్లడించాడు. ముఖ్యంగా.. అభిమానులకి షేక్ హ్యాండ్ ఇవ్వడంపై ఆటగాళ్లని కట్టడి చేస్తామని దీంతో పాటు క్రికెటర్లు బస చేసే హోటల్స్‌లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వివరించాడు.
వాంఖడే వేదికగా మార్చి 29న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారమే టోర్నీ జరుగుతుందని గంగూలీ తాజాగా స్పష్టం చేయడంతో రూమర్స్‌కి చెక్ పడింది.