మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన గంగుల…ఆత్మగౌరవం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గ్రానైట్ క్వారీల గురించి తనపై ఆరోపణలు చేసిన ఈటల…మంత్రిగా ఏడు సంవత్సరాల్లో ఏం చేశారని ప్రశ్నించారు. తాను ట్యాక్స్‌లు ఎగ్గొట్టానని చెబుతున్న ఈటల…దమ్మంటే సీబీఐకి లేఖ రాసి తనపై విచారణ జరిపించాలన్నారు. అదేవిధంగా ఈటల చేసిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. హుజురాబాద్‌లో గ్రానైట్ క్వారీలు తమిళనాడుకు చెందిన కంపెనీలే చేస్తున్నాయని…బొందల గడ్గగా మారుతుంటే ఏం చేస్తున్నావని మండిపడ్డారు. తమిళనాడు కంపెనీతో లాలూచీ పడ్డావా అని ప్రశ్నించారు. గ్రానైట్ క్వారీలు ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడితే చూస్తు ఊరుకుంటాయా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో బీసీ…హైదరాబాద్‌లో ఓసీ అని ఎద్దేవా చేశారు గంగుల.
తాను బీసీ బిడ్డను…చట్టపరంగా తన వ్యాపారం నడుస్తోందన్నారు. బీసీ ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడింది ఈటలేనని ఆరోపించారు. ఈటల మాదిరిగా తాను దేవాదాయ,అసైన్డ్ భూములు ఆక్రమించలేదన్నారు. బెదిరిస్తే భయపడేది లేదని…దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. హుజురాబాద్‌లో పార్టీని కాపాడుకుంటామని స్పష్టం చేసిన గంగుల…వ్యక్తిగతంగా దూషణలు చేస్తే సహించేది లేదన్నారు. రాజకీయాల్లో తన ఆస్తులు తరిగాయని…కానీ ఈటల ఆస్తులు అంతకుఅంతా పెరిగాయన్నారు. పదవి పోయిందన్న అక్కసుతో నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.