కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. రూ.1.75లక్షల కోట్లతో ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనాపై ప్రత్యేక కార్యాచరణతో కేంద్రం ముందుకెళ్తోంది.పేదలు, కార్మికులను ఆదుకోవడంపై దృష్టిపెట్టాము. అలాగే వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ ఉంటుందన్నారు.
గరీబ్ కల్యాణ్ స్కీమ్ పేరుతో ఆర్థిక ప్యాకేజీని ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.నగదు బదిలీ, ఆహార భద్రత ఈ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆమె వెల్లడించారు. పీఎం కిసాన్ యోజనలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు వేస్తామన్నారు. ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా 8.69 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చెందుతుంది. ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు..దీంతో 5 కోట్ల కుటుంబాలకు లబ్ది జరగనుంది. ప్రతి కార్మికుడికి దీనిద్వారా రూ.2 వేలు అదనంగా చేకూరుతుంది. ఈ మొత్తం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి ఖాతాల్లోకి చేరుతుంది అన్నారు.
జన్‌ధన్ యోజన ఖాతాల్లో 3 నెలలపాటు నెలకు రూ.500 చొప్పున జమ చేస్తాం.దీంతో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం పొందుతారు.కుటుంబ అవసరాలకు ఈ మొత్తం చేదోడుగా ఉంటుంది. రానున్న 3 నెలలకు ఈపీఎఫ్ చందా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతం కలిపి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లోకి ప్రభుత్వమే జమ చేస్తుంది.అయితే వందమంది లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. రూ.15 వేలులోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ కేంద్రమే భరిస్తుందని నిర్మలా సీతారామన్ తెపారు.
ఇక స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు. ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు అందజేస్తాం. దీని ద్వారా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ది చేకూరుతుంది. అలాగే ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఈ గ్యాస్ సిలిండర్ల పంపిణీ ద్వారా 8.3 కోట్లమంది లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.