తిరుపతి దర్శనం పేరిట మోసం!

2
- Advertisement -

తిరుపతి దర్శనం పేరుతో ఒక విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఆలయ పూజారి ..విశ్రాంత ఉద్యోగిని మోసం చేయడం గమనార్హం.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్వారం గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంకు ప్రతిరోజూ దర్శనానికి వెళ్తున్న ఒక విశ్రాంత ఉద్యోగితో సాయి తరుణ్ అనే ఆలయ పూజారి పరిచయం ఏర్పరచుకున్నాడు. కొంతకాలం తర్వాత అతడు తిరుపతి దర్శనం టిక్కెట్లు, ట్రైన్ టిక్కెట్లు బుక్ చేస్తానని చెప్పి బాధితుడి నమ్మకం సంపాదించాడు.

తర్వాత టిక్కెట్లు బుక్ చేస్తానని చెప్పి బాధితుడి మొబైల్ ఫోన్ తీసుకున్న సాయి తరుణ్, బ్యాంక్ పాస్వర్డ్ తెలుసుకుని ఫోన్‌లో వచ్చే మెసేజ్‌లు కనిపించకుండా సెట్టింగులు మార్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తిరుపతి దర్శనం టిక్కెట్ల పేరుతో ప్రతిరోజూ ఫోన్ తీసుకుని బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేయడం ప్రారంభించాడు.

ఇలా సుమారు 30 విడతల్లో మొత్తం రూ.18.46 లక్షలను దామెర హరీష్ అనే వ్యక్తి ఖాతాకు పంపినట్లు విచారణలో తేలింది. అయితే ఒకరోజు అవసరానికి డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లిన బాధితుడికి తన ఖాతాలో డబ్బులు లేవని అధికారులు తెలిపారు. దీంతో బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసి పరిశీలించగా, ప్రతి రోజు ఉదయం 9 గంటల లోపు రూ.99,999 చొప్పున డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించాడు.

Also Read:ప్రజల కోరిక మేరకే ‘కేరళం’గా మార్పు!

దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దామెర హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పూజారి సాయి తరుణ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

- Advertisement -