లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలో చిక్కుకున్న 30 మంది తెలంగాణ వాసులకు ఆపన్న హస్తం అందించి, స్వస్థలాలకు చేరుకునేలా చేశారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. కవిత ప్రత్యేక చొరవతో 25 మంది యువతులు, ఐదుగురు అబ్బాయిలు సోమవారం వారి స్వస్థలాలకు చేరుకున్నారు. నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 25 మంది అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలు శిక్షణ నిమిత్తం మహారాష్ట్రలోని అమరావతిలో ఉంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా యువతీ, యువకులకు కష్టాలు మొదలయ్యాయి. రోజులు గడుస్తున్నా కొద్ది, యువతీ యువకుల బాగోగుల గురించి వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందారు.
దీంతో తెలంగాణకు రావడానికి సహాయం చేయాల్సిందిగా మాజీ ఎంపీ కవితను కోరారు యువతీ యువకులు. వారి అభ్యర్థనపై వెంటనే స్పందించిన మాజీ ఎంపీ కవిత, 30 మందికి బస్సులు ఏర్పాటు చేయించారు. 30 మందికి భోజన సదుపాయాలు సైతం ఏర్పాటు చేశారు మాజీ ఎంపీ కవిత.బస్సులో సామాజిక దూరం పాటించడంతో పాటు, మాస్కులు, సానిటైజర్‌లు అందుబాటులో ఉంచారు.
30 మంది యువతీ యువకులు సోమవారం వారి స్వస్థలాలకు చేరుకున్నారు. అనంతరం వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్ర నుండి స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న మాజీ ఎంపీ కవితకి యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.