రాజకీయ కురువృద్ధుడు, మణిపూర్ మాజీ సీఎం రిషాంగ్ కీషింగ్ మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. 96 సంవత్సరాల వయసున్న ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
1972లో మణిపూర్ పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించిన కైషింగ్, ఆపై జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుంగ్యార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన 2002 వరకూ 7 సార్లు విజయం సాధించారు.
1975లో రాష్ట్ర మంత్రిగా, ఆపై 1980లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. స్వతంత్య్ర భారతావనిలో 1952లో ఏర్పడిన తొలి పార్లమెంటులో ఆయన కూడా సభ్యుడు కావడం విశేషం.
అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక కాలం పాటు సుదీర్ఘకాలం రాజ్యసభలో కనిపించిన వ్యక్తి కూడా ఆయనే కావడం గమనార్హం. మణిపూర్ సీఎం పదవిని తన రాజకీయ వారసులకు అప్పగించిన తరువాత, 2002లో పెద్దల సభకు ఎన్నికైన ఆయన, ఆపై 2008లో మరోసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికై 2014 వరకూ సేవలందించారు.
అక్టోబర్ 25, 1920లో జన్మించిన ఆయన, తన జీవితం తొలినాళ్లలో ఉపాధ్యాయ వృత్తిలోనూ రాణించారు. కీసింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ సంతాపం వ్యక్తం చేశారు. కీషింగ్ కుటుంబ సభ్యులకు మోడీ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
కాగా..మణిపూర్‌లోని స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.