దేశవ్యాప్తంగా రెండో దశలో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా భారీగా విస్తరిస్తోంది. బీహార్ మాజీ విద్యాశాఖ మంత్రి, అధికార జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరీ కరోనాతో కన్నుమూశారు. గతవారం కరోనాబారిన పడిన మేవాలాల్ పట్నాలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 4 గంటలకు మృతిచెందారు.
ఆయన ప్రస్తుతం తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం తర్వాత సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో నెలరోజుల వ్యవధిలోనే మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి మృతిపట్ల సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.