తెలంగాణ బీజేపీలో విభేదాలు రచ్చకెక్కాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌కు వస్తున్న కిషన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్లో ఫ్లెక్సీ గొడవ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది.
గత ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన బండపల్లి సతీష్ కుమార్ చిలకలగూడ నుంచి వారాసీగూడ వరకు స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. అయితే ఈ ఫ్లెక్సీల్లో తన ఫోటో లేదని ఆగ్రహించిన సికింద్రాబాద్ బీజేపీ ఇంఛార్జీ రవి ప్రసాద్ గౌడ్,అతడి కుమారుడు సాయి గౌడ్ ఫ్లెక్సీలను చించేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండపెల్లి సతీష్ ఫిర్యాదు మేరకు రవిప్రసాద్‌గౌడ్, సాయిప్రసాద్‌గౌడ్, సందీప్, ఉపేందర్‌లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సీనియర్ నాయకుడైన తన ఫొటోను ఫ్లెక్సీలో లేనందునే వాటిని చించివేసినట్లు తెలిపారు రవిశంకర్ గౌడ్. తన ఇల్లు, కార్యాలయం ముందు తన ఫొటోలు లేని ఫ్లెక్సీలను కట్టిన బండపల్లి సతీష్ అనుచరులు తమను రెచ్చగొడుతున్నారన్నారు. అసలే అంతంతమాత్రం కేడర్ కలిగిన పార్టీలో ఉన్న కొద్దిపాటి నాయకులు బజారున పడి ఫ్లెక్సీలు చించుకోవడం పట్ల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.