ఒకే రోజు.. ఒకే వేదికగా ఐదు వేల మొక్కలు..

139
- Advertisement -

ఒకే రోజు, ఒకే వేదికగా ఐదు వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం పూర్తిచేసింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. చౌటుప్పల్ సమీపంలో దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో వందలాది మంది కలిసి ఐది వేల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బాలీవుడ్ ఐరన్ మ్యాన్ అజయ్ దేవగన్ పాల్గొని ఎం.పీ సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో పాటు అజయ్ దేవగన్‌కు చెందిన ఎన్.వై ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో వంద మంది పారిశ్రామిక వేత్తలు, నూటా పది మంది కళాకారులు, మూడు వందల మంది స్థానికులు పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా అజయ్ దేవగన్‌ మాట్లాడుతూ.. నాకు మొక్కలు, పచ్చదనం అంటే చాలా ఇష్టం. సమాజం వ్యాపారీకరణతో, కాలుష్యకాసారంగా మారడం తీవ్రంగా కలచివేస్తోంది. అభివృద్ధి ఎంత అవసరమో.. పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరం. అందుకే నాకు తోచిన విధంగా ఎన్.వై ఫౌండేషన్స్ స్థాపించి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాను అన్నారు. అన్ని వ్యవహారాల్లో లాభనష్టాలు చూసుకుంటున్న ఈ రోజుల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపంలో నిస్వార్థంగా పని చేస్తున్న ఎం.సీ సంతోష్ కుమార్‌ను, ఆయన బృందాన్ని చూస్తే గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు అజయ్ దేవగన్.

ఎంపీ సంతోష్ కుమార్ కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించాం. పర్యావరణంపై సమాజంలో మార్పు తీసుకొచ్చి భవిష్యత్ తరాలకు సమతూల్యమైన ప్రకృతిని అందించాలనే ఆశయంతో నిరంతరంగా ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలో అజయ్ దేవ్‌గన్‌కు చెందిన ఎన్.వై ఫౌండేషన్స్ తోడవటం మాకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇక ముందు కూడా కలిసి వచ్చేవారితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకువెళ్తామన్నారు రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్.

ఇండస్ట్రియల్ పార్కులో ఒకే రోజు 5 వేల మొక్కలు నాటాము. ఈ పారిశ్రామిక వాడను గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా, పచ్చదనంతో అభివృద్ది చేస్తామని పరిశ్రమల ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బాలు మున్నంగి, రాఘవ, కరుణాకరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -